గుంటూరు: బతుకే బేరం! అప్పుల పాలై కిడ్నీలు అమ్ముకుంటున్న రైతులు

 

ఆత్మహత్య కంటే ఇదే నయమనే భావన,  

పల్నాడులో మళ్లీ 1998 నాటి పరిస్థితులు..ఆరు నెలల్లో 15 మంది కిడ్నీల మ్మకంఒక్కో కిడ్నీకి రూ.4 లక్షల నుంచి 5 లక్షలు

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013/feb/14/main/14main15&more=2013/feb/14/main/main&date=2/14/2013

గుంటూరు, ఫిబ్రవరి 13 : కష్టాలు నిజం! కన్నీళ్లు నిజం! ఆత్మహత్య చేసుకుని పైలోకాలకు పారిపోవడమా!? లేక… ఉన్న రెండు మూత్ర పిండాల్లో ఒకటి అమ్ముకుని కుటుంబాన్ని ఆదుకోవడమా!? ఇదీ ప్రశ్న! ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు రైతుల్లో కొందరు మాత్రం కిడ్నీలు అమ్ముకుంటున్నారు. 1998లో పల్నాడులో రైతుల కిడ్నీల అమ్మకాల ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో 23 మంది వరకు రైతులు కిడ్నీలు అమ్ముకున్నారు. ఇప్పుడు అ దే పునరావృతం అవుతోంది. అప్పుల నుంచి బయటపడేందుకు ఇంతకు మించి ప్రత్యామ్నాయం కనిపించడంలేదంటూ… రైతులు మళ్లీ కిడ్నీలు అమ్ముకుంటున్నారు. 


రెంటచింతల, దాచేపల్లి తదితర ప్రాంతాల్లో… ఈ ఆరేడు నెలల్లో సుమారు 15 మంది రైతులు కిడ్నీలు అమ్ముకున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక్కో కిడ్నీని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున అమ్ముకున్నారు. అప్పుడూ ఏజెంట్లే… ఇప్పుడే ఏజెంట్లే! అవసరాల్లో ఉన్న రైతులపై వలలు విసిరేది వారే. కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన కొంతమంది దళారులు మూత్రపిండాలు అమ్మేవారిని సంప్రదిస్తున్నారు. వారిని హైదరాబాద్ తీసుకెళుతున్నారు. ‘పరస్పర ఆమోదం’ ఉన్నప్పటికీ కిడ్నీలు దానం చేసేందుకు, స్వీకరించేందుకు వీల్లేదు. కిడ్నీ అవసరమైన వారికి… వారి కుటుంబ సభ్యులు మాత్రమే కిడ్నీ దానం చేయాల్సి ఉంటుంది.

కాగా రైతులకు రూ.5 లక్షల వరకు లభిస్తుండగా… దళారులు రూ.2 లక్షల నుంచి రూ. 3లక్షల వరకు దండుకుంటున్నారు. రెంటచింతలలో బత్తిన ఏడుకొండలు అనే రైతు రెండు నెలల క్రితం కిడ్నీ అమ్ముకున్నట్లు తెలిసింది. మూడు వారాల క్రితం వెంకటరెడ్డి అనే మరో రైతు కూడా మూత్రపిండాన్ని అమ్ముకున్నారు. ఏడు నెలల క్రితం దానబోయిన అప్పారావు (24) అనే యువ రైతు కూడా అప్పుల బాధ తట్టుకోలేక ఒక కిడ్నీని రూ.5 లక్షలకు అమ్ముకున్నారు. ప్రస్తుతం అప్పారావు కుటుంబం మాచర్లలో కూలీ పనిచేసుకుంటూ జీవిస్తోంది. ఆత్మహత్య చేసుకుంటే భార్య, పిల్లలు వీధిన పడతారని తప్పని పరిస్థితిల్లో మూత్ర పిండాన్ని అమ్ముకున్నట్లు అప్పారావు తెలిపారు. ప్రస్తుతం రెంటచింతలలో రెవెన్యూ అధికారులు మూత్రపిండాలు అమ్మిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు.

చావలేక..
“ఎకరానికి రూ. 20వేల నుంచి రూ. 25 వేల వరకు కౌలు కడుతున్నా. ఎరువులు, కూలీలు, పురుగుమందుల ఖర్చులు 70 వేల వరకు అవుతోంది. పంట మాత్రం పండటంలేదు. కుటుంబం ఖర్చులు, పిల్లల చదువులు, రోగాలు… అన్నీ కలిసి అప్పుల పాలయ్యాను. కౌలు రైతుకు ప్రభుత్వ సాయం అందడంలేదు. ఆత్మహత్య చేసుకునే ధైర్యంలేక… మూత్రపిండం అమ్ముకున్నాను. బరువు పనులు చేయలేకపోతున్నాను.”
– అప్పారావు
 

వ్యవసాయ బడ్జెట్-2013-14 కు రైతు స్వరాజ్య వేదిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం, అఖిల పక్ష రైతుసంఘాల ప్రతిపాదనలు

అనేక సంవత్సరాల పోరాటం తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యెక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది.  అయితే ఈ వ్యవసాయ బడ్జెట్ కేవలం నిధులు కేటాయింపు గా మాత్రమే చూడకుండా, వ్యవసాయానికి దిశానిర్దేశం చేసే విధంగా వుండాలి అని కోరుతూ, సుస్థిర వ్యవసాయ కేంద్రం, అఖిల పక్ష రైతు సంఘాలు, ఏ.పి. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యం లో చర్చించి చేసిన ప్రతిపాదనలు.

121227 AP Agricultural Budget Proposal చదవండి.

సాగు భారమై.. బతుకు ఆగమై.. నిట్ట నిలువునా కూలుతున్న రైతన్న

సాగు భారమై..
బతుకు ఆగమై..
నిట్ట నిలువునా కూలుతున్న రైతన్న
చేల గట్లపై మరణ మృదంగం
పెరుగుతున్న ఆత్మహత్యలు
16 ఏళ్లలో 31 వేల మంది బలవన్మరణం

పెరిగిన పెట్టుబడులు,
గిట్టుబాటుకాని ధరలే ప్రధాన కారణం
అందని ప్రభుత్వ ప్రోత్సాహం, రుణం
కౌలు రైతుల బతుకు మరీ కష్టం
అధికారిక నివేదికల్లోనే వెల్లడి

ఒక రైతుకు వరి శిక్ష! మరో రైతు నెత్తిన పత్తి కత్తి! ఇంకో రైతుకు నిలువెల్లా కూర గాయాలు! మరో రైతుకు భారంలా వేరుశనగ! ఘోరంగా ఉల్లి! చేదుగా చెరుకు! ఏ రైతును చూసినా… కష్టమే! సాగు నష్టమే! పొలాలనన్నీ హలాల దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు… ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు.

హైదరాబాద్, నవంబర్ 22 : ఇది ఒక్క ఏడాది కథ కాదు! ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ! ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు భరోసా ఇవ్వడంలేదు. ఎరువు బరువై… కూలీలు కరువై. నీరు కన్నీరై… విత్తు దశ నుంచే చిత్తు చిత్తై అన్నదాతలు నిట్టూర్పు వదులుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడులు, కనికరించని ప్రకృతి… రైతులను జంట కోరల పాములా కాటేస్తున్నాయి. కడివెడు దాహానికి చుక్క నీరు పోసినట్లుగా… బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు అందించే రుణాలు రైతు అవసరాలను తీర్చలేకపోతున్నాయి.

ప్రైవేటు వ్యాపారుల వడ్డీలు నడ్డి విరుస్తుంటే, కాళ్ల కింద భూమి కదిలిపోతుంటే… బతుకే భారమనుకుని రైతు తనువు చాలిస్తున్నాడు. 1995 నుంచి 2010 మధ్య… అంటే 16 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఏకంగా 31,120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది జాతీయ నేర సమాచార విభాగం చెప్పిన అధికారిక సమాచారం! దీనికి కారణాలను సుస్థిర వ్యవసాయ కేంద్రం, రైతు సురాజ్య వేదిక, యాక్షన్ ఎయిడ్, జయతీ ఘోష్ కమిటీ తదితర సంస్థలు, సంఘాలు విశ్లేషించాయి.

‘కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పట్టించుకోవడంలేదు. ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేయడంతప్ప… వాటి నివారణపై చిత్తశుద్ధి కనిపించడమే లేదు” అని తెలిపాయి. రైతుకు అండగా నిలిచే వ్యవసాయ రంగానికి సంబంధించిన ముఖ్య సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పేర్కొన్నాయి. వీటన్నింటి ఫలితమే… రైతుల ఆత్మహత్యలు అని వివరించాయి.

రాలుతున్న రైతులు
రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే అగ్రస్థానం మన పొరుగునే ఉన్న మహారాష్ట్రది. ఆ తర్వాతి స్థానం… ఆంధ్రప్రదేశ్‌దే. గత ఏడేళ్లుగా… కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో రైతు ఆత్మహత్యల సంఖ్య తగ్గుతుండగా… మన రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. ‘మాది రైతు సంక్షేమ ప్రభుత్వం’ అని చెప్పుకొన్న కాలంలోనూ పెద్ద సంఖ్యలో రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 1995-2002 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో 12,716 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

2003-2010 మధ్యకాలంలో బలవన్మరణం పాలైన అన్నదాతల సంఖ్య ఏకంగా 18,404కు చేరింది. ఒకవైపు రైతుల వారసులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వ్యాపకాలు చూసుకుంటుండగా… మరోవైపు హలం బాట పట్టిన యువ రైతులు మధ్యలోనే జీవితమనే కాడిని పారేస్తున్నారు. యువ రైతులు వాణిజ్య పంటలకు ప్రాధాన్యమిస్తూ… అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు దెబ్బతి, పెట్టుబడులూరాక చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

2010లో 15-29 ఏళ్ల మధ్య వయసున్న 728 మంది యువ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో… యువకులు 563 మందికాగా, మహిళలు 165 మంది. ఇక అదే సంవత్సరం 30-44 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో 824 మంది పురుషులు, 137 మంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే మొత్తం 2525 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ అధికారికంగా తెలిపింది.

ఇవీ కారణాలు
* వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి.
* బోర్లపై ఆధారపడటం అధికమైంది. బోర్లు విఫలం కావడంతో రైతులపై భారం పెరిగిపోతోంది.
* ధరలు గిట్టుబాటు కావడంలేదు. కనీస పెట్టుబడులు కూడా తిరిగి రావడంలేదు.
* రైతులు సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించడంలేదు.
* చిన్న కమతాలు, కౌలు సేద్యంతో కలిసిరావడంలేదు.
* వ్యాపార స్వేచ్ఛ, ఎగుమతి-దిగుమతి విధానాలు రైతులకు అనుకూలంగా లేవు.
* బీమా, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు తగిన స్థాయిలో లేవు.
* వర్షాధార వ్యవసాయాన్ని ప్రభుత్వం విస్మరించింది.
* ప్రభుత్వ విధానాలు పెద్ద రైతులకు, భారీ తరహా వ్యవసాయానికి, కొన్ని రకాల వ్యాపార పంటలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి.

దిగదుడుపు
మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కానీ… రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లభించదు. 2010-11, 2011-12లో ధరలను పరిశీలిస్తే… అప్పుడు క్వింటాలు పత్తి ధర రూ.6500. అదే పత్తి ఇప్పుడు రూ.3600. అప్పుడు క్వింటాలు పసుపు రూ.14 వేలు. ఇప్పుడు రూ.4 వేలు. అప్పటికీ, ఇప్పటికీ మిర్చి రూ. 12 వేల నుంచి రూ.5500కు తగ్గింది. కందులు రూ.5 వేల నుంచి రూ. 3500లకు, మినుములు 5200 నుంచి రూ.3500కు తగ్గాయి, జొన్న 2500 నుంచి రూ.1800కు తగ్గాయి. పెట్టుబడులు మాత్రం భారీగా పెరిగాయి.

జయతీ ఘోష్ సిఫార్సులివి…
* అందరికీ సాగునీరందేలా చేయాలి.
* కౌలుదారులతోసహా రైతులందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలి.
* మెట్ట భూముల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి.
* సుస్థిరమైన, చౌకగా లభించే ఉత్పాదకాలను ఉపయోగించాలి.
* గిట్టుబాటు ధర విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.
* గ్రామీణులు ఆర్థికంగాఎదిగేలా వ్యవసాయేతరకార్యకలాపాలను ప్రోత్సహించాలి.

ఆత్మహత్యలు నివారించాలంటే…
* పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి.
* రైతులనుంచి ప్రభుత్వమే పంటను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలి.
* ఎగుమతి, దిగుమతి విధానాలను మన రైతులకు అనుగుణంగా మార్చాలి.
* ప్రభుత్వం సకాలంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, రుణ చెల్లింపునకు సహకరించాలి.
* మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేనప్పుడు పెట్టుబడి వ్యయంతో పాటు అదనంగా 50 శాతం ధర చెల్లించాలి.

జీవ వైవిధ్యంతోనే ఆహార భద్రత – జి.వి.రామాంజనేయులు

మన దేశంలో ఇప్పుడు ఉత్పత్తవుతున్న ఆహారధాన్యాలు మన అవసరాల కంటే రెండింతలు ఎక్కువే అయినా ఆకలి, పేదరికం ఉన్నాయి. గ్రామీణ ప్రజలకి ఆదాయ భద్రత కల్పించకుండా ఆహార భద్రత అసంభవం. ఆహార భద్రత అంటే పోషకాహార భద్రత కావాలి. పర్యావరణ భద్రత కావాలి. అప్పుడే దేశానికి ఆహార భద్రత. అది కొత్త టెక్నాలజీలలో లేదు. జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని, జీనవోపాధులు కాపాడుకోవడంలోనూ, ప్రకృతి వనరులను కాపాడుకోవడంలోనూ ఉంది.

మానవ మనుగడ అంతా కూడా ప్రకృతిలోని జీవజాతులని సమర్థంగా, సుస్థిరంగా వాడుకోవటంపై ఆధారపడి ఉంటుంది. ఈ జీవ వైవిధ్యంలో ఎక్కువ భాగం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంది. ప్రకృతి వనరులని విచ్చలవిడిగా వాడుకొని పారిశ్రామికంగా, వ్యాపారాత్మకంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ భావి వాణిజ్య ప్రయోజనాలకు ఈ జీవ వైవిధ్యంపైన కన్నువేశాయి. తమ దగ్గర లేని ఈ జీవ వైవిధ్యాన్ని వాడుకోవటానికి అవకాశం, వాడుకోవటంలో వీటిపై మేధో సంబంధ హక్కులు సంపాదించుకోవటానికి పెద్ద దేశాలు ప్రయత్నించటంతో ఇరవై సంవత్సరాల క్రితం- ఈ పరస్పర వ్యతిరేక ఆలోచనలను, ఒక తాటిపైకి తెచ్చి సుస్థిర అభివృద్ధి సాధించటానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ‘జీవ వైవిధ్య సదస్సు’ ప్రారంభమైంది.

ప్రపంచంలో ఇప్పుడు సాగులో ఉన్న పంటలన్నీ పుట్టినవి ఎనిమిది ప్రాంతాలలో అని శాస్త్రవేత్తలు చెబుతారు. వాటిలో భారతదేశం ఒకటి. మన దేశంలో సుమారు 375 పంటలలో, 140కి పైగా పశువులలో వైవిధ్యం ఉంది. ప్రపంచ భూ విస్తీర్ణంలో భారత్ కేవలం 2.4 శాతం మాత్రమే. అయినా జనాభా 18 శాతం. ఇంతటి జనాభా ఉన్నా, మానవాళికి తెలిసిన 45వేల రకాల మొక్కలు, 91 వేల రకాల పశువులు మన దేశంలో ఉన్నాయి. ఇంతటి వైవిధ్యానికి పుట్టినిల్లు అయిన దేశంలో మనం ఈ జీవ వైవిధ్యాన్ని త్వరితగతిన కోల్పోతున్నాం. అం దుకు ఈ జనాభా పెరుగుదల, అభివృద్ధి అవసరాలు కారణం అని ప్రభుత్వం చెబుతున్నా, విశ్లేషణలు అన్నీ కూడా ప్రభుత్వం ఎంచుకున్న తప్పుడు విధానాలే కారణమని స్పష్టం చేస్తున్నాయి. ఆధునిక వ్యవసాయం పేరుతో జరిగిన /జరుగుతున్న విధ్వంసం కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణాలు కావొచ్చు, గనుల తవ్వకాలు కావచ్చు లేక పారిశ్రామికీకరణ పేరుతోనో, పట్టణీకరణ పేరుతోనే కావొచ్చు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ విధ్వంసం కొనసాగుతూ ఉంది. ఇలాంటి విధ్వంసకరమైన అభివృద్ధికి వ్యతిరేకంగా చాలా ప్రాంతాలలో ప్రజలు తిరగబడుతూనే ఉన్నారు. స్థానిక జీవనోపాధులకు ఇలాంటి అభివృద్ధి ముప్పు అని గుర్తించి పోరాటం చేస్తున్నారు.

జీవ వైవిధ్యాన్ని ఆహార, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం వ్యవసాయ రంగంలోనే ఎక్కువ వాడుకుంటాం. జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లటంతో వ్యవసాయరంగానికి పెద్ద ముప్పు, తద్వారా మన ఆహార భద్రతకు పెనుముప్పు ఏర్పడే అవకాశం ఉంది. మన దేశ వ్యవసాయంలో ఒకప్పటి జీవ వైవిధ్యం: వరి- లక్ష రకాలు; మామిడి- 1000 రకాలు; జొన్న -5000 రకాలు; వంగ- 3500 రకాలు; ఆవులు -27జాతులు; మేకలు -22 జాతులు; గొర్రెలు-40 జాతులు; కోళ్ళు- 18 జాతులు; గేదెలు-ఎనిమిది జాతులు.

ప్రపంచంలో సహజంగా ఉండే మొక్కల్లో కొన్ని మొక్కలను తన అవసరాలకు వాడుకోవచ్చని మానవుడు గుర్తించటంతో వ్యవసాయం, తద్వారా స్థిర జీవనం, గ్రామాల అభివృద్ధి ప్రారంభమయ్యాయి. మన దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, వివిధ అవసరాల కోసం అనువైన వంగడాలు, వ్యవసాయ పద్ధతులు కాలక్రమేణా అభివృద్ధి చెందాయి. మన అవసరాలకు వాడుకుంటున్న పంటలన్నింటినీ మూడు వేల సంవత్సరాల క్రితమే సాగులోకి తెచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క కొత్త పంటని కూడా మానవ జాతి కనుక్కోలేకపోయింది.

అయితే ఆధునిక వ్యవసాయం పేరుతో మనం ఎంచుకున్న విధానాలు ఈ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చేసరికి మన ఆహార అవసరాలకు అనేక పంటలు ఉన్నా, కేవలం కొన్ని పంటలపై దృష్టి పెట్టడం వల్ల మిగిలినవి కనుమరుగైపోయాయి. ఆహారధాన్యాలు అంటే ఈ రోజు మనకు తెలిసినది కేవలం వరి, గోధుమ మాత్రమే. వీటికంటే ఆరోగ్యకరమైన చిరుధాన్యాలు ఈ రోజు సాగులో లేవు. వరి, గోధుమ సాగు పెరగటం వలన నీటి వినియోగం పెరిగింది. ఒక కిలో వరి బియ్యం పండటానికి దాదాపు 5000 లీటర్ల నీరు అవసరం; అదే జొన్న, సజ్జ లాంటి చిరుధాన్యాలకైతే కేవలం 200 లీటర్ల నీరు సరిపోతుంది.

ఇలా పంటల సరళిలో మార్పురావటం వలన నీటి వినియోగం పెరిగి భూగర్భ జలాలు తరిగిపోయాయి. అలాగే పెద్ద విస్తీర్ణంలో ఒకే పంట వేయటం వలన పురుగులు, తెగుళ్ళ సమస్యలు, ఒకే పంటను మరలా మరలా భూమిలో సాగుచేయటం వలన భూసారం కోల్పోవటం జరుగుతోంది. దీనివలన పురుగు మందుల వినియోగం, రసాయనిక ఎరువుల వినియోగం పెరుగుతోంది. అలాగే మన రాష్ట్రంలోని ఒంగోలు జాతి ఆవులు కానీ, పుంగనూరు ఆవులు కానీ, దక్కనీ గొర్రెలు కానీ, అసిల్ కోళ్ళు కానీ అన్నీ మన ప్రాంతాలకి అనువైనవి. వాటిని ప్రోత్సహించకుండా కేవలం బయట దేశాల నుంచి తెచ్చిన వాటినే ప్రోత్సహించటం జరుగుతోంది.

ఎక్కడ తప్పు చేశాం? చారిత్రకంగా చూస్తే చాలా రకాల పంటలు మన దేశంలోనే ఉద్భవించటంతో పాటు స్థానిక వనరుల ఆధారంగా వివిధ అవసరాల కోసం సాగు పద్ధతులు, పంట రకాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆధునిక వ్యవసాయం పేరుతో మనం అమెరికా వ్యవసాయాన్ని అనుకరించే ప్రయత్నాలు చేయటంతో కష్టాలు మొదలయ్యాయి. వరి మనకి ముఖ్యమైన ఆహార పంట. క్రీ.శ. 1700 ప్రాంతాలలోనే తమిళనాడులోని చెంగలప్పట్టు జిల్లాలో వరి దిగుబడులు హెక్టారుకి 9 టన్నులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మెట్ట ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో సాగు పద్ధతులు, రకాలు వేరుగా ఉండేవి. వాటికి అనుగుణంగానే దిగుబడులు ఉండేవి.

స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో 50 వేల రకాల వరి వంగడాలు సాగులో ఉండేవి. అందులో సుమారు 55 శాతం మెట్ట వరి రకాలు. హరిత విప్లవం పేరుతో మనం వీటన్నిటిని నాశనం చేసి నీటి ముం పుతోటే పండించే కొన్ని అధిక దిగుబడి రకాలను ప్రోత్సహించాం. దీని వలన ఈ వైవిధ్యం అంతా కోల్పోయి ఈ రోజు మన దేశంలో దాదాపు 85 శాతం వరి కేవలం పది రకాల నుంచి మాత్రమే వస్తుంది. అంటే ఆశ్చర్యపడాల్సిందే. వరదలను తట్టుకునే రకాలు, కరువుని తట్టుకునే రకాలు, ఉప్పు నీటిని తట్టుకునే రకాలు అనేకం ఉండేవి. అలాగే ఎక్కువ విటమిన్‌లు, పోషకాలు ఉన్న రకాలు కూడా సాగులో ఉండేవి. అయితే ఇప్పుడు అవే లక్షణాలను జన్యుమార్పిడి ద్వారా ప్రవేశపెట్టటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మనకి పోషకాలు కావాలంటే ఆహారంలో వైవిధ్యం ఉండాలి కానీ ఒక్క వరిలోనే అన్ని పోషకాలు ఉండేలా చేయాలి అనుకోవటం మూర్ఖత్వం. ప్రభుత్వ పరిశోధనలు, సబ్సిడీలు, మద్దతు ధరలు అన్నీ వరికి మాత్రమే సహకారం అందిస్తూ ఉండటంతో తృణ ధాన్యాల సాగు క్రమేపీ తగ్గుతూ ఇప్పుడు పూర్తిగా కనుమరుగవుతోంది. పోషకాల పరంగా చూస్తే వరి వీటికి ఏ మాత్రం సాటిరాదు. పైగా నీటి వినియోగం కూడా తక్కువ. పోషకాలు ఎక్కువగా ఉండే పంటలను ప్రోత్సహించకుండా ఇప్పుడు ‘గోల్డెన్ వరి’ పేరుతో జన్యుమార్పిడి వరి తేవటానికి ప్రయత్నం జరుగుతోంది. వరిలో విటమిన్ బి తయారీకి అవసరమైన బీటా కేరాటిస్ ఉత్పత్తి అయ్యేలా, అలాగే ఎక్కువ ఐరన్ ఉండేలా జన్యుమార్పిడి పంటలను తయారుచేస్తున్నారు. కొన్ని పంటలను, వాటిల్లో కేవలం కొన్ని రకాలు, కొన్ని రకాల పండించే పద్ధతులను మాత్రమే ప్రోత్సహించటం వల్లే సమస్యలు వస్తున్నాయని గుర్తుంచుకోవాలి.

యాంత్రికీకరణకు అనుగుణంగా పంట రకాలు, వ్యవసాయ పద్ధతులు మార్చుకోవటం ఇంకో పెద్ద సమస్య. దీనికి పత్తిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రపంచం అంతా ఆకులూ, చర్మాలూ కట్టుకునే రోజుల్లో మన దేశంలో పత్తి సాగులో ఉండేది. ప్రపంచ దేశాలన్నిటిలోనూ మొహంజోదారో నాటి నుంచి మన దేశం బట్టలకు ప్రసిద్ధి. అయితే పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చిన స్పిన్నింగ్ మిల్లులకై, బ్రిటన్‌కు పత్తి ఎగుమతి చేయటం కోసం అమెరికన్ పొడుగు పింజ పత్తిని ప్రవేశపెట్టారు. దేశీయ పత్తి మెట్ట ప్రాంతాలలో పండేది. పురుగు- తెగుళ్ళ సమస్య తక్కువ అయితే, ఈ అమెరికన్ పత్తి పంటకు నీటి వినియోగం ఎక్కువ.

పైగా పురుగుల-తెగుళ్ళ సమస్యలు ఎక్కువ. ఈ అమెరికన్ పత్తులతోనే, ఇప్పుడు వ్యవసాయరంగంలో పెద్ద ఎత్తున వినాశనానికి కారణంగా వున్న ‘పచ్చ పురుగు’ (దీనిని అమెరికన్ బోల్ వార్మ్ అని అంటారు) వచ్చింది. వాటిని నియంత్రించటానికి రసాయనిక పురుగు మందులు, వాటికి తట్టుకునే శక్తి పెంచుకుంటే ఇంకా విషపూరితమైన పురుగు మందులు, ఇప్పుడు జన్యుమార్పిడి పత్తి ఇలా సమస్యకి తప్పుడు పరిష్కారాలు వెతుకుతుంటూనే ఉన్నాం. నిజానికి దేశీయ పత్తి రకాలని అభివృద్ధిచేసి, దానికి అనుకూలంగా స్పిన్నింగ్ యూనిట్లు తయారుచేసి ఉంటే సమస్య చాలా మటుకు తక్కువ ఉండేది. అలాగే పురుగుమందుల వాడకం పెంచుకుంటూ పోవటం, జన్యుమార్పిడి పంటలను అభివృద్ధి చేయటం లాంటివి కాకుండా స్థానిక వనరులతో చేసిన సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తే ఖర్చులు తగ్గటంతో పాటు జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుకున్న వారమవుతాము.

ఆధునిక వ్యవసాయంతో వచ్చే సమస్యల గురించి మాట్లాడినప్పుడల్లా ఆహారభద్రతకు ఇదే దారి అని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రోజు మన దేశంలో సుమారు 25 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. మన దేశ జనాభా 130 కోట్లు. అందరూ మూడు పూటలా భోజనం చేస్తారు అనుకున్నా మనకు కావలిసింది 9.5 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు మాత్రమే (ప్రతి వ్యక్తికీ రోజుకు 200గ్రాముల లెక్క తీసుకుంటే). అంటే ఇప్పుడు ఉత్పత్తవుతున్న ఆహారధాన్యాలు మన అవసరాల కంటే రెండింతలు ఎక్కువ. అయినా దేశంలో ఆకలి, పేదరికం ఉన్నాయి. ప్రజలకి, ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న గ్రామీణ ప్రజలకి ఆదాయ భద్రత కల్పించకుండా ఆహారభద్రత అసంభవం.

అలాగే ఆహార భద్రత అంటే కేవలం వరి, గోధుమ కాదు. తిండి గింజలు మాత్రమే కాదు. పోషకాహార భద్రత కావాలి. పర్యావరణ భద్రత కావాలి. అప్పుడు దేశానికి ఆహార భద్రత. అది కొత్త టెక్నాలజీలలో లేదు. వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని, చిన్న సన్నకారు రైతుల, రైతు కూలీల జీనవోపాధులు కాపాడుకోవడంలోనూ, ప్రకృతి వనరులను కాపాడుకోవడంలోనూ ఉంది.

– జి.వి.రామాంజనేయులు
సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,
వీణ రావు
సీఎస్ఏలో పరిశోధకురాలు
(నేడు ఆహార భద్రతా దినోత్సవం)

ప్రజలకు నిర్ణయాధికారం కావాలి: Ramanjaneyulu

(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ )

ఆంధ్రజ్యోతి: అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వల్ల ఏమైనా ప్రయోజనముందంటారా?

జీవీ రామాంజనేయులు: అభివృద్ధి చెందిన దేశాల్లో జీవ వైవిధ్యం పెద్దగా కనిపించదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని వాణిజ్య అవసరాల కోసం వాడుకుంటుండటంతో ముప్పు వాటిల్లుతోంది. ఈ ప్రమాదం నుంచి బయటపడే ఉద్దేశ్యంతోనే దాదాపు 193 దేశాలు కలిసి జీవ వైవిధ్య సదస్సును నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న సీఓపీ-11లో కార్టెజెనా బయోసేఫ్టీ ప్రొటోకాల్ గురించి చర్చ జరిగింది. జన్యు మార్పిడి పంటల వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను గురించి చర్చించిన సదస్సు సామాజిక, ఆర్థిక విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని అభిప్రాయపడింది. ఈ పంటల వల్ల జీవ భద్రతకు నష్టం వాటిల్లుతుందని ఒప్పుకుంటే దానికి ఎవరు జవాబుదారీతనం వహించాలనేది ప్రశ్న. ఒకవేళ విత్తనాలను ఎగుమతి చేస్తే అక్కడ నష్టానికి ఎవరిని బాధ్యులను చేయాలనే సమస్య. ప్రస్తుతం బయో డైవర్సిటీ ఆతిథ్య దేశమైన భారతదేశం వచ్చే రెండేళ్లు అధ్యక్ష పదవిలో ఉండనుంది. అంటే ఇక్కడ జరిగిన నిర్ణయాల అమలు పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బయో డైవర్సిటీ సదస్సు మూలంగా పెద్దగా ప్రయోజనాలేవీ ఉండే అవకాశం లేదు.

ఆంధ్రజ్యోతి: గతంలో జరిగిన నిర్ణయాలేవైనా అమలు జరిగాయా?

జీవీ: 2010 సీఓపీ జపాన్‌లో జరిగింది. అక్కడ జరిగిన కొన్ని నిర్ణయాలు ఇప్పుడిప్పుడే ఆచరణలోకి వస్తున్నాయి. జన్యుమార్పిడి పంటల విషయంలో ఆర్థిక విషయాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలనేది గతంలో జరిగిన నిర్ణయమే. వాటిని ప్రస్తుతం సీరియస్‌గా అందరూ అంగీకరిస్తున్నారు. ఎక్సెస్ బెనిఫిట్ షేర్ గురించి చర్చ జరిగింది. వాణిజ్యం కోసం జీవ వైవిధ్యాన్ని వాడుకుంటే అప్పటి వరకు వాటిని కాపాడిన వారికి ఎలాంటి ప్రతిఫలం అందించాలనే అంశంపై కూడా ఈ సదస్సులో చర్చ జరిగింది.

ఆంధ్రజ్యోతి: సీఓపీలో జరిగే నిర్ణయాలు అమలు చేయడంలో స్థానిక చట్టాలు అంగీకరించకపోతే?

జీవీ: ఎక్కడ ఏ నిర్ణయం జరిగినా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో జరగాలి. ప్రజలకు నిర్ణయాధికారం కావాలి. గ్రామస్థాయిలో బయో డైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీలు ఉండాలి. అవేవీ లేకుండా, ఎవరితో చర్చించకుండా,ప్రజల భాగస్వామ్యం లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రస్తుతం జీవ వైవిధ్య సదస్సు అలాగే నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఒప్పందాలైనా ప్రజలదే నిర్ణయాధికారం కావాలి. కేంద్రం, శాస్త్రవేత్తలది కాదు. దేశంలో బీటీ వంగ విషయంలో మాత్రమే ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించింది. ఇక అన్ని విషయాల్లో ప్రజల అభిప్రాయాలతో సంబంధంలేకుండానే నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో జన్యుమార్పిడిపై జరుగుతున్న ఫీల్డ్ ట్రాయిల్స్ ఇందుకు ఉదాహరణ. అందుకే ఈ సదస్సును వ్యతిరేకిస్తూ ‘పీపుల్స్ బయో డైవర్సిటీ ఫెస్టివల్’ను నిర్వహిస్తున్నాం.

ఆంధ్రజ్యోతి: జీవ వైవిధ్య నష్టానికి కారణాలేంటి?

జీవీ: జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడమంటే సమస్యకు మూలాల్ని వెతకడం. బయో డైవర్సిటీ సదస్సు సందర్భంగా పిచ్చుకలు, రాబందులు అంతరించిపోతున్నాయంటూ భారీ హోర్డింగులు పెట్టారు. కారణమేంటో చెప్పలేదు. అందుకు ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలే కారణం. జన్యు మార్పిడి విత్తనాలు, క్రిమి సంహారక మందులు, సెల్‌ఫోన్ టవర్లు పక్షుల మనగడను ప్రశ్నార్థకంగా మార్చాయి. వైవిధ్యాన్ని రక్షించే పంటల్ని ప్రోత్సహించాల్సింది పోయి… అనువుగానివి వేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, అడవుల్ని విధ్వంసం చేసి మైనింగ్‌లకు అనుమతిస్తున్నారు. సోంపేట లాంటి ప్రాంతాల్లో బీల భూముల్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే… పవర్ ప్లాంట్‌ల పేరిట ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నాయి. ఇలాంటి ప్రాజెక్టుల మూలంగా జీవ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది.

ఆంధ్రజ్యోతి: జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఏం చేయాలి?

జీవి: జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి దీర్ఘకాలిక కార్యక్రమాన్ని చేపట్టాలి. వైవిధ్య పంటల్ని ప్రోత్సహించాలి. రైతులకు ఆర్థిక భద్రత కల్పించాలి. పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి నష్టం చేకూర్చే ప్రాజెక్టులను నిలిపివేయాలి. పర్యావరణాన్ని కాపాడే పరిశోధనలను ప్రోత్సహించాలి. అప్పుడే జీవవైవిధ్యాన్ని గుర్తించినవాళ్లమవుతాం. ప్రజలు సైతం జీవవైవిధ్యాన్ని కాపాడడం తమ బాధ్యతగా స్వీకరించాలి.

జన్యు మార్పిడి పంటలపై మభ్యపెట్టే ప్రచారం

http://www.prajasakti.com/todaysessay/article-396090

అరిబండి ప్రసాద్‌రావు   Fri, 5 Oct 2012, IST

స్థూల ఆదాయంలో అన్ని ఖర్చులూ తీసేసిన తర్వాత మాత్రమే జన్యుమార్పిడి పంటల వల్ల రైతులకు నికరంగా మిగిలే ఆదాయం తేలుతుంది. ఇలా చేయడానికి ఏ శాస్త్రవేత్తా అక్కర్లేదు. సామాన్యులందరికీ తెలుసు. కానీ అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగిన ఇఫ్రి స్థూల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని జీవ సాంకేతిక పంటలు రైతుల ఆదాయాన్ని పెంచాయని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇఫ్రి ఇలా ఎవరి ప్రయోజనాల కోసం చేసినట్లు? కేవలం బయోటెక్‌ పరిశ్రమ పక్షాన మభ్యపెట్టే ప్రచారానికి తోడ్పడడానికే తప్ప వాస్తవాల్ని తెలుసుకోవడానికి మాత్రం కాదు.

‘అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ (ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ – సంక్షిప్తంగా ఇఫ్రి) ఆఫ్రికా, ఆసియా, లాటిన్‌ అమెరికాలలో క్షేత్ర (ఫాం) స్థాయిలో జరిపిన అధ్యయనంలో జన్యుమార్పిడి పంటలు వేసిన రైతులు అదే రకం మామూలు పంటలు వేసిన వారికన్నా ‘స్థూల ఆదాయాన్ని’ అధికంగా పొందినట్లు తేలింది’ అని ఆ సంస్థ సీనియర్‌ శాస్త్ర పరిశోధకుడు వివరించినట్లు హిందూ పత్రికలో ఈ నెల నాలుగున ప్రచురితమైంది. జీవ వైవిధ్యంపై ఇప్పుడు జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు సందర్భంలో బయట జరిగిన ఓ చర్చా కార్యక్రమం తరువాత ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఆహార విధాన రూపకల్పనలో ఈ సంస్థ గుర్తింపు కలిగి ఉంది. వాషింగ్టన్‌ కేంద్రంగా ఇది పనిచేస్తోంది.

ఏ పరిశోధనా సంస్థ అయినా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ జన్యుమార్పిడి పంటల అవసరాన్ని నిర్థారించడానికి ‘నికరాదాయం’ కాకుండా ‘స్థూల ఆదాయాన్ని’ ఎంచుకుంది. స్థూల ఆదాయాన్ని ఎంచుకోవడం అశాస్త్రీయం. కేవలం జన్యుమార్పిడి పంటలకు అనుకూలంగా నిర్థారణ చేయడానికే ఇలా చేసిందని భావించాల్సి వస్తుంది. ఈ అధ్యయనాన్ని ఇఫ్రి కేవలం జన్యుమార్పిడి పంటల ద్వారా రైతు స్థాయిలో ఒనగూడే లాభాల విషయంలో మభ్యపెట్టే ప్రచారం చేపట్టిందని ఇప్పుడు భావించాల్సి వస్తుంది. ఇలాంటి ప్రచారాన్నే జన్యుమార్పిడి పంటల సేద్యాన్ని విస్తరింపజేయడానికి బయోటెక్‌ పరిశ్రమ కూడా ప్రచారం చేస్తోంది.

తప్పుదోవ పట్టించే సూచీ ఎంపిక

‘స్థూల ఆదాయం’ పంట దిగుబడి, ఉపకరణాల వినియోగం, వాటి ధరలు, ఇతర ఖర్చులు, అమ్మకం ధర మీద ఆధారపడి ఉంటుంది. జన్యుమార్పిడి పంటల విత్తనం ఖరీదైనది. ఏ విత్తనం దానంతట అదే అధిక దిగుబడిని ఇవ్వదు. విత్తనాలకు తోడు ఎరువుల్ని వాడితేనే అధిక దిగుబడి వస్తుంది. బిటి పత్తికి అధిక ఎరువులను వాడాలని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచిస్తుంది. స్థూల ఆదాయంలో అన్ని ఖర్చులూ తీసేసిన తర్వాత మాత్రమే జన్యుమార్పిడి పంటల వల్ల రైతులకు నికరంగా మిగిలే ఆదాయం తేలుతుంది. ఇలా చేయడానికి ఏ శాస్త్రవేత్తా అక్కర్లేదు. సామాన్యులందరికీ తెలుసు. కానీ అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగిన ఇఫ్రి స్థూల ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని జీవ సాంకేతిక పంటలు రైతుల ఆదాయాన్ని పెంచాయని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ సంస్థ ఇలా ఎవరి ప్రయోజనాల కోసం చేసినట్లు? కేవలం బయోటెక్‌ పరిశ్రమ పక్షాన మభ్యపెట్టే ప్రచారానికి తోడ్పడడానికే తప్ప వాస్తవాల్ని తెలుసుకోవడానికి మాత్రం కాదు.

వాస్తవమేమిటి?

అమెరికన్‌ బయోటెక్‌ పరిశ్రమ, దాని మద్దతుదారులు ఏకపక్షంగా జన్యుమార్పిడి పంటల మంచి చెడ్డల్ని, ముఖ్యంగా జీవ భద్రత, పర్యావరణం, ఆరోగ్య సమస్యలపై నిర్దిష్టంగా పరిశోధన చేయకుండానే తక్షణ లాభాల కోసం ఎన్నో ఒత్తిళ్లు, ఉధృత ప్రచారంతో జన్యుమార్పిడి పంటలను ప్రపంచం మీద రుద్దారు. దీనికి సంబంధించిన విషయాలు ప్రజాశక్తి పత్రికలోని విజ్ఞానవీచిక శీర్షికలో ఈ నెల 4నే ఇవ్వబడ్డాయి. జన్యుమార్పిడి పంటల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సామాజిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పై సదస్సు వెలుపల ఈ సమస్య పైనే చర్చ సాగింది.

మన అనుభవాలు

మన దేశంలో పత్తి ఉత్పత్తి 2002-03లో 136 లక్షల బేళ్లు (170 కిలోలవి) కాగా 2011-12 నాటికి 380 లక్షల బేళ్లకు పెరిగింది. ఈ కాలంలో పంట విస్తీర్ణం 76.67 లక్షల హెక్టార్ల నుంచి 121.91 లక్షల హెక్టార్లకు పెరిగింది. హెక్టార్‌ దిగుబడి మాత్రం 2002-03లో ఉన్న 312 కిలోలు కాగా 2007-08 నాటికి 554 కిలోలకు పెరిగింది. ఆ తర్వాత 2011-12 నాటికి 481 కిలోల స్థాయికి క్రమంగా తగ్గింది. ఎరువుల వినియోగం సస్యరక్షణ ఖర్చు, ఇతర ఉపకరణాల వినియోగం ఈ కాలంలో పత్తిలో బాగా పెరిగాయి. అందువల్ల పెరిగిన పత్తి ఉత్పత్తిని (వచ్చిన స్థూల ఆదాయాన్ని), కేవలం బిటి సాంకేతికానికి ఆపాదించడం సరికాదని భారత కాటన్‌ కార్పొరేషన్‌, వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చుల, ధరల నిర్ణయ కమిషన్లు (2011లో) తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్‌లో …

ఈ సంవత్సరం రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల్లో పత్తి రైతులే అత్యధికం. వీరి ఆత్మహత్యల వార్తలు రానిరోజు లేదు. బిటి పత్తి సేద్యం వలన రైతుల ఆదాయం పెరిగితే వీరు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? బిటి సగటు దిగుబడి ఏడాదికేడాది పడిపోతోంది. 2001-02లో హెక్టార్‌కు సగటు దిగుబడి 418 కిలోలు కాగా 2007-08 నాటికి ఇది 690 కిలోలకు ఎగుడుదిగుళ్లతో పెరిగింది. ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ 2010-11 నాటికి 505 కిలోలకు తగ్గింది. 2011-12లో ఇది 440 కిలోలు మాత్రమే. అయినా, పత్తి విస్తీర్ణం 2007-08 నుంచి క్రమంగా పెరుగుతూనే ఉంది. 2003-04లో ఇది 8.77 లక్షల హెక్టార్లు కాగా 2011-12 నాటికి ఇది 18.54 లక్షల స్థాయికి చేరింది. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో కూడా 2012-13లో విస్తీర్ణం 21.78 లక్షల హెక్టార్లకు పెరిగింది. దిగుబడి తగ్గుతున్నా విస్తీర్ణం ఎందుకు పెరుగుతుంది? మిగతా పైర్లతో పోల్చినప్పుడు పత్తి రేటు అధికంగా ఉండడమే దీనికి ముఖ్య కారణం. క్వింటాల్‌ పత్తి రూ.1,700-1,800 నుంచి గరిష్టంగా రూ.6,500లకు పెరిగింది. ఆ తర్వాత వెంటనే ధర పడిపోయింది. గత సంవత్సరం రూ.3,500-3,900 మధ్య కొనసాగింది. కనీస మద్దతు ధర 2011-12లో రూ.2,800, కాగా 2012-13లో అంచనా వేసిన ఉత్పత్తి ఖర్చు రూ.2,895. కానీ సూచించిన కనీస మద్దతు ధర రూ.3,900. వేరుశనగ, సోయాచిక్కుడు, పొద్దుతిరుగుడు, కంది, మినుము, పెసలు, రాగి, జొన్నలు వంటి అన్ని పైర్లకూ ఇలా అంచనా వేసిన ఖర్చుకన్నా సూచించిన కనీస మద్దతు ధర తక్కువగా ఉంది. (ఈ గణాంకాలన్నీ కాటన్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌, వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులు- ధరల కమిషన్‌ ఖరీఫ్‌ 2012 నివేదికలోనివి). దీనివల్లే దిగుబడితో సంబంధం లేకుండా పత్తి విస్తీర్ణం పెరిగింది. పైగా స్వతహాగా వాతావరణ ఒడిదుడుకులను ఇతర పైర్లకన్నా పత్తి బాగా తట్టుకుంటుంది. కానీ మామూలు హైబ్రిడ్లతో పోల్చినప్పుడు బిటి హైబ్రిడ్‌ ఇదేవిధంగా తట్టుకోలేదనేది వేరే విషయం. ఒక నిష్పక్ష పరిశోధనా సంస్థ (ఇఫ్రి)గా భారత బిటి పత్తి అనుభవాలను ఎలా విశ్లేషిస్తుంది? లేక స్థూల ఆదాయం పెరిగిందని అశాస్త్రీయంగా అవాస్తవాలనే నిర్ధారిస్తుందా? బయోటెక్‌ పరిశ్రమ నేడు చేస్తున్నదిదే!

అమెరికా అనుభవాలు

అమెరికన్‌ వ్యవసాయ శాఖ నివేదిక (నెం 810, 2002)లో వాణిజ్యపరంగా సేద్యమవుతున్న జన్యుమార్పిడి పంటల్ని ఇది కాని అదే రకం పంటతో పోల్చినప్పుడు అధిక దిగుబడి ఇవ్వదని తెలిపింది. దిగుబడి తగ్గవచ్చని కూడా తెలిపింది. అయితే, ఈ పంటలు ఎలా వేగవంతంగా విస్తరించగలిగాయో తెలుసుకోవాలని ఆకాంక్షించింది. నియంత్రిత వాతావరణంలో జన్యుమార్పిడి సోయా దిగుబడి ఇలా మార్పిడి లేని సోయాబీన్‌ కన్నా తక్కువగా ఉంది. ఇలా తగ్గిపోయిన దిగుబడిలో 50 శాతం మేర జన్యుమార్పిడి ప్రక్రియ సమయంలో జరిగిన మార్పుల ప్రభావమని గుర్తించబడింది. ఇదేవిధంగా 2005లో బిటి హైబ్రిడ్‌ మొక్కజొన్న పంట కోత కాలం పెరిగింది. దిగుబడి 12 శాతం తగ్గింది. (మూలం : మైకేల్‌ ఆంటోనియో, తదితరులు 2012. జిఎంఒ- మిత్స్‌ అండ్‌ ట్రూత్స్‌)

పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్థారణలు

వ్యవసాయ సాంకేతికాల అభివృద్ధి ప్రభావాలను అంచనా వేయడానికి సుస్థిర, దీర్ఘకాల లక్ష్యంతో అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలని వ్యవసాయ విజ్ఞాన సాంకేతికాల అంతర్జాతీయ అధ్యయనం (ఐఎఎఎస్‌టిడి) స్పష్టంగా తెలిపింది. ఆధునిక పంట రకాలు దిగుబళ్లను పెంచినప్పటికీ ఇవి జీవ వైవిధ్యాన్ని పణంగా పెడతాయని, సంప్రదాయ ఆహార అందుబాటుపై దుష్ప్రభావం కలిగి ఉంటాయని జీవ సాంకేతికాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం 2012 ఆగస్టులో తెలిపింది. ఖర్చులు కానీ, లాభాలు కానీ పేదలకు ఒకే విధంగా అందవని, పేదలు ఖర్చుల్ని ఎక్కువగా భరిస్తూ తక్కువ లాభాల్ని పొందుతున్నారని కమిటీ తెలిపింది. (పేరా 5.10). జీవ సాంకేతికాల వినియోగంలో ఇమిడి ఉన్న అన్ని అంశాలనూ పరిశీలించిన తర్వాత పార్లమెంటరీ స్టాడింగ్‌ కమిటీ పై అంతర్జాతీయ నివేదికతో అంగీకరించింది. బిటి పత్తి ప్రవేశపెట్టిన ప్రారంభంలో అధిక దిగుబడి, చేసిన ఉధృత ప్రచారం వల్ల రైతులు పెద్దఎత్తున బిటి పత్తివైపు మళ్లారు. కానీ, అధిక ఉపకరణాల ధరలు, తగ్గుతున్న దిగుబడి, పెరుగుతున్న కీటకాల నిరోధక శక్తి, పెరిగిన ఇతర కీటకాల ఉధృతి … అన్నీ కలిపి రైతు ఆర్థిక శక్తిని కొన్ని సంవత్సరాల్లోనే హరించివేశాయని కమిటీ గమనించింది. వీరంతా చిన్న, సన్నకారు రైతులు. కేవలం విదర్భ ప్రాంతంలో 2006-11 మధ్యకాలంలో 7,992 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కమిటీ గమనించింది. రైతులు లాభాలు వస్తాయనే ఆశతో బిటి పత్తివైపు మళ్లి త్వరలోనే నష్టపోవాల్సి వచ్చింది. మామూలు పత్తికి ఇప్పుడు రైతులు మళ్లాలన్నా విత్తనాలు దొరకని స్థితి. బిటి పత్తి వల్ల విత్తన కంపెనీలు ప్రధానంగా లాభపడగా పేద, నిస్సహాయ రైతులు ఖర్చుల్లో ఎక్కువభాగం భరించాల్సి వచ్చిందని, వారికి లాభాల్లో సరైన వాటా దక్కలేదని పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్ధారించింది. 2009లో రుణ మాఫీ పథకాన్ని పెద్దఎత్తున అమలు పరచినప్పటికీ రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, అప్పుల ఊబిలో కూరుకుపోయారని కమిటీ గుర్తించింది (పేరా 5.46). ఈ నేపథ్యంలో ఇఫ్రి అధ్యయన ఫలితాల్ని ఎలా అర్థం చేసుకోవాలి?

జీవవైవిధ్యాన్ని సురక్షితంగా జన్యు బ్యాంకుల్లో పరిరక్షిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను పార్లమెంటరీ కమిటీ తప్పుపట్టింది. ఇది ప్రభుత్వానికి పురావస్తు భాండాగారం (మ్యూజియం)లో ఉంచిన సంతోషాన్ని కలిగిస్తుందని కమిటీ విమర్శించింది. మారుతున్న పర్యావరణ, వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతిలో సహజంగానే మరింత జీవవైవిధ్యం అవసరమని, ఇది ఆవిర్భవించడానికి జన్యు బ్యాంకులు తోడ్పడవని కమిటీ అభిప్రాయపడింది. ‘నగోయా’ ఒప్పందం ద్వారా పొందగలిగే ప్రయోజనాల్లో మనదేశ ప్రయోజనాలు పెద్దఎత్తున ఇమిడి ఉన్నందున ఎంతో సుసంపన్నమైన మన జీవ వైవిధ్యాన్ని నష్టపోకుండా కొనసాగించాలని కమిటీ నొక్కి చెప్పింది. అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తిని, భద్రతను సుస్థిరంగా కొనసాగించడానికి ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయని, అస్థిరత్వంతో కూడిన జీవసాంకేతికాలపై ఆధారపడకూడదని కమిటీ నొక్కి చెప్పింది.

(జీవ సాంకేతికాలపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ రిపోర్టు నివేదిక పేరాలు 8.114 నుంచి 8.118 వరకు)

దిగుబడులకు బీటీ దెబ్బ: జి.వి. రామాంజనేయులు

http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/aug/26/edit/26edit3&more=2012/aug/26/edit/editpagemain1&date=8/26/2012

ముఖాముఖి

జన్యుమార్పిడి పంటలపై మరిన్ని పరిశోధనలు, సరైన నియంత్రణ వ్యవస్థ లేకుండా ఫీల్డ్ ట్రయల్స్‌కు అనుమతించకూడదని పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫార్సులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జన్యు మార్పిడి పంటలకు సంబంధించిన అంశాలపై పరిశ్రమవర్గాలు చెబుతున్న దానికి, పరిశోధనలలో తేలుతున్న నిజాలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జన్యుమార్పిడి పంటలకు సంబంధించిన వాస్తవాలు, భ్రమలపై అధ్యయనం చేస్తున్న ‘సెంటర్ ఫర్ సస్టేయనబుల్ అగ్రికల్చరల్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జి.వి. రామాంజనేయులుతో ఈ వారం ముఖాముఖి..

బీటీ విత్తనాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. కాని పరిశోధనలలో తేలుతున్న నిజాలు వేరే విధంగా ఉంటున్నాయి..?
బీటీ విత్తనాలు కరువు పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడతాయని.. దిగుబడి ఎక్కువ వస్తుందని.. ఈ పంటలకు కలుపు మందులు వేయాల్సిన అవసరం లేదని.. పురుగులు ఎక్కువ రావనే ప్రచారం జరుగుతోంది. కాని ఈ ప్రచారం నిజం కాదు. బీటీ విత్తనాల వల్ల దిగుబడి బాగా పెరిగిందనేది పూర్తి అవాస్తవం. ఉదాహరణకు బీటీ పత్తిని తీసుకుందాం.

2001 నుంచి 2005 దాకా మన దేశంలో పత్తి దిగుబడి 78 శాతం పెరిగింది. దీనిలో కేవలం ఆరు శాతం విస్తీర్ణంలో మాత్రమే బీటీ విత్తనాలను వేశారు. ఇదే విధంగా 2006-11 సంవత్సరాల మధ్య చూస్తే- మొత్తం విస్తీర్ణం 80 శాతం పెరిగితే- దానిలో దిగుబడి రెండు శాతం పెరిగింది. ఈ రెండింటి «ఆధారంగా చూస్తే దిగుబడి పెరగటానికి బీటీ విత్తనాలు మాత్రమే కారణం కాదని అర్థమవుతుంది. అదనంగా సాగు కిందకు వచ్చిన భూమి పెరగటం మొదలైన ఇతర కారణాలు చాలా ఉన్నాయి.

వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా బీటీ విత్తనాలు వేసిన ప్రాంతాల్లో దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఇక బీటీ విత్తనాలు పురుగులను తట్టుకుంటాయని చేస్తున్న వాదనలో కూడా నిజం లేదు. పురుగులు బీటీ విత్తనాలను తట్టుకొనే శక్తిని పెంచుకున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ఉదాహరణనే తీసుకుంటే- గులాబీ రంగు తొలిచే పురుగును బీటీ పత్తి విత్తనాలు తట్టుకోలేకపోతున్నాయని మోన్‌శాంటోనే ప్రకటించింది. ఇదే విధంగా బీటీ విత్తనాలు కాయి తొలిచే పురుగులను కూడా తట్టుకోలేకపోతున్నాయి.

బీటీ పత్తికి సంబంధించి కంపెనీలు గుజరాత్‌ను ఒక రోల్ మోడల్‌గా ప్రచారం చేస్తూ ఉంటాయి. గుజరాత్‌లో నిజంగానే బీటీ పత్తి విజయం సాధించిందా?
గుజరాత్ ప్రభుత్వ నివేదికల ఆధారం చూస్తే పత్తి సాగు చేసే ప్రాంతం దాదాపు 45 శాతం పెరిగింది. అదనంగా సాగులోకి వచ్చిన ప్రాంతం 43 శాతం పెరిగింది. వీటికి తోడుగా హైబ్రీడ్ పత్తి వేసిన ప్రాంతం కూడా పెరిగింది. ఈ కారణాల వల్ల గుజరాత్‌లో దిగుబడి పెరిగింది తప్ప- బీటీ విత్తనాల వల్ల మాత్రమే కాదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. చాలా సార్లు జన్యు మార్పిడి పంటల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రచారం చేసేవారు- తమ వద్ద ఉన్న సమాచారాన్ని పూర్తిగా అందించరు. తమకు అనుకూలంగా కనిపించే కొంత సమాచారాన్ని ఇస్తారు. దీనిని చూస్తే- అంతా సజావుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు.

బీటీ వంకాయ ఫీల్డ్ ట్రయల్స్‌కు సంబంధించి పెద్ద వివాదం నడుస్తోంది కదా. దీని వెనకున్న కథ ఏమిటి?
బీటీ వంకాయ విత్తనాల వల్ల కలిగే దుష్ఫరిమాణాలను జాగ్రత్తగా అధ్యయనం చేయకుండా అనుమతించవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా పది రాష్ట్రాలు బీటీ వంకాయ ఫీల్డ్ ట్రయల్స్‌ను అనుమతించబోమని ప్రకటించాయి. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. జన్యు మార్పిడి పంటల వల్ల వచ్చే లాభనష్టాలను సమీక్షించటానికి మన దగ్గర సరైన నియంత్రణా వ్యవస్థ లేదు. ఉదాహరణకు బీటీ పత్తినే తీసుకుందాం. దీని లాభనష్టాలను 2005లో చివరి సారి సమీక్షించారు. ఆ తర్వాత ఎప్పుడూ మళ్లీ సమీక్ష జరగలేదు.

బీటీ పత్తి వల్ల అనేక దుష్ఫరిణామాలు ఏర్పడుతున్నాయని ఈ లోపులో అనేక పరిశోధనలు వచ్చాయి. ఉదాహరణకు వరంగల్ జిల్లాలో బీటీ పత్తి ఆకులు తిని పశువులు మరణించాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి వాటిని ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలి. చాలా సార్లు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోదు. పైగా జన్యుమార్పిడి పంటలపై పరిశోధనలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించి, తామే పరిశోధనలు చేస్తామని ప్రకటిస్తోంది కూడా. ఈ మొత్తం వ్యవహారం వెనక పెద్ద పెద్ద కంపెనీల లాబీయింగ్ కూడా ఉంటుంది.

మన కన్నా ముందే కొన్ని దేశాలలో జన్యు మార్పిడి పంటల పరిజ్ఞానం ప్రవేశించింది కదా. వారి అనుభవాలేమిటి?
ప్రపంచంలో పన్నెండు దేశాల్లో మాత్రమే జన్యు మార్పిడి పంటలను వేస్తున్నారు. వారి అనుభవాలు కూడా అంత సంతృప్తికరంగా లేవు. అమెరికాలో తాజాగా చేసిన పరిశోధనలలో- ఈ పంటల వల్ల దిగుబడి బాగా తగ్గుతోందని తేలింది. అంతే కాకుండా ఈ పంటలను తట్టుకొనే చీడ పురుగులు తయారయ్యాయి. వీటిని సూపర్ వీడ్స్ అని పిలుస్తున్నారు.

దీనికి తోడు పేటెంట్స్ పేరిట మొత్తం విత్తన మార్కెట్ అంతా కొన్ని కంపెనీల చేతిలోకి వెళ్లిపోతుంది. ఈ ప్రక్రియ మన దేశంలో కూడా ప్రారంభమయింది. ఉదాహరణకు మన దేశంలో బీటీ పత్తి విత్తన మార్కెట్‌లో 98 శాతం మాన్‌శాంటో చేతిలోనే ఉంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయాన్ని చెబుతాను. బీటీ విత్తనాలకు సంబంధించిన అంశాలలో కంపెనీని ప్రభుత్వం నియంత్రించాలి. కాని పరిస్థితి ఆ విధంగా లేదు. చాలా సార్లు కంపెనీయే ప్రభుత్వంపై కేసులు పెట్టింది.

ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి ఉన్న మార్గాలేమిటి?
ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులపై ప్రభుత్వం శ్రద్ధ చూపించాలి. పరిశోధనలకు నిధులను కేటాయించాలి. పరిశోధనాశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. వీటిన్నింటితో పాటుగా నియంత్రణ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలి. ఈ విత్తనాలకు సంబంధించిన అంశాలలో కొందరిని బాధ్యులను చేయాలి. ప్రస్తుతం ఈ పద్ధతి లేకపోవటం వల్ల ఇటు ప్రభుత్వం కాని, ఈ విత్తనాలను అనుమతించిన రెగ్యులేటర్ కాని, తయారు చేసిన కంపెనీ కాని బాధ్యత తీసుకోవటం లేదు. దీని వల్ల సామాన్య రైతులు నష్టపోతున్నారు.
– ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్. ప్రసాద్