గుంటూరు: బతుకే బేరం! అప్పుల పాలై కిడ్నీలు అమ్ముకుంటున్న రైతులు

 

ఆత్మహత్య కంటే ఇదే నయమనే భావన,  

పల్నాడులో మళ్లీ 1998 నాటి పరిస్థితులు..ఆరు నెలల్లో 15 మంది కిడ్నీల మ్మకంఒక్కో కిడ్నీకి రూ.4 లక్షల నుంచి 5 లక్షలు

http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013/feb/14/main/14main15&more=2013/feb/14/main/main&date=2/14/2013

గుంటూరు, ఫిబ్రవరి 13 : కష్టాలు నిజం! కన్నీళ్లు నిజం! ఆత్మహత్య చేసుకుని పైలోకాలకు పారిపోవడమా!? లేక… ఉన్న రెండు మూత్ర పిండాల్లో ఒకటి అమ్ముకుని కుటుంబాన్ని ఆదుకోవడమా!? ఇదీ ప్రశ్న! ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు రైతుల్లో కొందరు మాత్రం కిడ్నీలు అమ్ముకుంటున్నారు. 1998లో పల్నాడులో రైతుల కిడ్నీల అమ్మకాల ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో 23 మంది వరకు రైతులు కిడ్నీలు అమ్ముకున్నారు. ఇప్పుడు అ దే పునరావృతం అవుతోంది. అప్పుల నుంచి బయటపడేందుకు ఇంతకు మించి ప్రత్యామ్నాయం కనిపించడంలేదంటూ… రైతులు మళ్లీ కిడ్నీలు అమ్ముకుంటున్నారు. 


రెంటచింతల, దాచేపల్లి తదితర ప్రాంతాల్లో… ఈ ఆరేడు నెలల్లో సుమారు 15 మంది రైతులు కిడ్నీలు అమ్ముకున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక్కో కిడ్నీని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున అమ్ముకున్నారు. అప్పుడూ ఏజెంట్లే… ఇప్పుడే ఏజెంట్లే! అవసరాల్లో ఉన్న రైతులపై వలలు విసిరేది వారే. కార్పొరేట్ ఆసుపత్రులకు చెందిన కొంతమంది దళారులు మూత్రపిండాలు అమ్మేవారిని సంప్రదిస్తున్నారు. వారిని హైదరాబాద్ తీసుకెళుతున్నారు. ‘పరస్పర ఆమోదం’ ఉన్నప్పటికీ కిడ్నీలు దానం చేసేందుకు, స్వీకరించేందుకు వీల్లేదు. కిడ్నీ అవసరమైన వారికి… వారి కుటుంబ సభ్యులు మాత్రమే కిడ్నీ దానం చేయాల్సి ఉంటుంది.

కాగా రైతులకు రూ.5 లక్షల వరకు లభిస్తుండగా… దళారులు రూ.2 లక్షల నుంచి రూ. 3లక్షల వరకు దండుకుంటున్నారు. రెంటచింతలలో బత్తిన ఏడుకొండలు అనే రైతు రెండు నెలల క్రితం కిడ్నీ అమ్ముకున్నట్లు తెలిసింది. మూడు వారాల క్రితం వెంకటరెడ్డి అనే మరో రైతు కూడా మూత్రపిండాన్ని అమ్ముకున్నారు. ఏడు నెలల క్రితం దానబోయిన అప్పారావు (24) అనే యువ రైతు కూడా అప్పుల బాధ తట్టుకోలేక ఒక కిడ్నీని రూ.5 లక్షలకు అమ్ముకున్నారు. ప్రస్తుతం అప్పారావు కుటుంబం మాచర్లలో కూలీ పనిచేసుకుంటూ జీవిస్తోంది. ఆత్మహత్య చేసుకుంటే భార్య, పిల్లలు వీధిన పడతారని తప్పని పరిస్థితిల్లో మూత్ర పిండాన్ని అమ్ముకున్నట్లు అప్పారావు తెలిపారు. ప్రస్తుతం రెంటచింతలలో రెవెన్యూ అధికారులు మూత్రపిండాలు అమ్మిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు.

చావలేక..
“ఎకరానికి రూ. 20వేల నుంచి రూ. 25 వేల వరకు కౌలు కడుతున్నా. ఎరువులు, కూలీలు, పురుగుమందుల ఖర్చులు 70 వేల వరకు అవుతోంది. పంట మాత్రం పండటంలేదు. కుటుంబం ఖర్చులు, పిల్లల చదువులు, రోగాలు… అన్నీ కలిసి అప్పుల పాలయ్యాను. కౌలు రైతుకు ప్రభుత్వ సాయం అందడంలేదు. ఆత్మహత్య చేసుకునే ధైర్యంలేక… మూత్రపిండం అమ్ముకున్నాను. బరువు పనులు చేయలేకపోతున్నాను.”
– అప్పారావు
 

Comments

Posted in Articles, తెలుగు and tagged , .

Leave a Reply