రైతాంగంపై వాతావ‘రణం’!

భూవాతావరణంలో వస్తున్న పెనుమార్పుల ప్రభా వం మనకు నిత్యమూ అనుభవంలోకి వస్తూనే ఉంది. వ్యవసాయం ప్రధానంగా వాతావరణంపై ఆధారపడి సాగే ఉత్పత్తి కార్యకలాపం. నిజానికి వాతావరణంలోని మార్పులు, వ్యవసాయం పరస్పరం ప్రభావాన్ని నెరపుతుంటాయి. వాతావరణంలోని మార్పు ల ప్రభావాన్ని తక్కువగా అంచనావేయడం తరచుగా జరుగుతోంది. అలాగే వాతావరణంపై వ్యవసాయం కలుగజేస్తున్న మార్పులను కూడా చిన్నచూపు చూస్తు న్నాం. అందువల్లనే సాధారణంగా వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం చుట్టూనే చర్చలు సాగుతుం టాయి. నిజంగానే వాతావరణ మార్పులకు అనువైన సేద్య పద్ధతులను రూపొందించాలన్నా, అమలు చేయాలన్నా ముందుగా వ్యవసాయం, వాతావరణాల మధ్య పరస్పర ప్రభావ సంబంధాలను సమగ్రంగా అర్థం చేసుకోవడం అవసరం. భారత రైతాంగం ఇప్పటికే అనుభవిస్తున్న జీవావరణ, ఆర్థిక, సామాజిక రాజకీయ సంక్షోభపు విశాల నేపథ్యం నుంచి వాటిని అవగాహన చేసుకోవడం అంతకంటే అవసరం.

వ్యవసాయానికి, వాతావరణ మార్పులకు మధ్య సంబంధం త్రిముఖమైనది. ఒకటి, వృక్ష, జంతు, జీవప్రక్రియలపై వ్యవసాయంలోని మార్పులు కలుగజేసే ప్రత్యక్ష ప్రభావం. రెండు, నేలలోనూ, నేలలోని తేమలోనూ వచ్చే మార్పులు, చీడపీడలూ, వ్యాధులూ తదితర వ్యవసాయ జీవావరణ సంబంధమైన మార్పులు. మూడు భూతాపం పెరుగుదలతో వాతావరణంలో వస్తున్న మార్పుల రీత్యా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రత్యేకించి గ్రామీ ణ ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న సామాజిక, ఆర్థికసంస్థల శక్తిసామర్థ్యాలు.

వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావం

వాతావరణ మార్పులు దేశవ్యాప్తంగా పలు విధాలుగా రూపు తీసుకుంటాయి. ప్రాంతీయమైన తేడాలున్నా దేశవ్యాప్తంగా పలుచోట్ల వేసవిలో వర్షపాతం పెరగడం, మొత్తంగా వర్షం కురిసిన రోజుల సంఖ్య తగ్గడం కనిపిస్తోంది. ఇక ఉష్ణోగ్రతలకు సంబంధించి గత వందేళ్లలో 0.6 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల మాత్రమే ఉంది. కానీ 2100 నాటికి ఉష్ణోగ్రతలో పెరుగుదల 3.5 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని అంచనా. బొగ్గుపులుసు వాయువు సాంద్రత మాత్రం ఏడాదికి 1.9 పీపీఎం మేర పెరుగుతోంది. 2050 నాటికి అది 550 పీపీఎంలకు చేరుతుంది. అతి వేడి, అతి శీతల గాలులు, దుర్భిక్షాలు, వరదలు వంటి అసాధారణ వైపరీత్యాలు ఇప్పటికే మన అనుభవంలోకి నిత్యం వస్తూనే ఉన్నాయి. భారత వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం. వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతంలో మార్పులు సంభవిస్తాయని పరిశోధనలు ఎప్పుడో తేల్చి చెప్పాయి. రుతుపవనాలు, వాతావరణం, నీటి వనరుల మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఉదాహరణకు దేశంలో మొత్తంగా పంట వేసిన ప్రాంతంలో మూడింట రెండువంతులు క్షామపీడిత ప్రాంతమని, 4 కోట్ల హెక్టార్లు వరదలకు గురయ్యే ప్రాంతమని అంచనా. వాతావరణ మార్పుల తాకిడికి ఎక్కువగా గురయ్యేది నిరుపేద రైతులే. వాళ్లు ప్రధానంగా వర్షాధార భూములపైనా, చేపల పెంపకంపైనా ఆధారపడి ఉంటారు. పైగా వారి భూములు నిస్సారమైనవిగా, వరదలకు గురయ్యేవిగా ఉంటాయి. వాతావరణ మార్పులను తట్టుకోగలిగిన ఆర్థిక స్థోమత వారికి ఉండదు.

వాతావరణంలోని మార్పుల ఫలితంగా నేలలోని జీవసేంద్రియ పదార్థాలు, తేమ స్థాయి తగ్గుతుంది. భూసారం కొట్టుకుపోతుంది. ఫలితంగా పంట స్వభావంలో మార్పులు సంభవిస్తాయి. నైట్రోజన్, ప్రొటీన్‌లస్థాయి తగ్గి, ఎంజైమ్‌లస్థాయి పెరుగుతుంది. వరిలో జింకు, ఇనుము శాతం తగ్గి, జంతువుల పునరుత్పత్తి క్షీణిస్తుంది. దీంతో చీడపీడలు పెరిగిపోతాయి. క్లుప్తంగా చెప్పాలంటే భూతాపం పెరగడం వల్ల నీరు ఆవిరై, వాతావరణంలో సగటు ఆవిరి పెరుగుతుంది. రుతుపవన సంవిధానంలో గణనీయమైన మార్పులు చోటుచోసుకొని సుదీర్ఘమైన వర్షాభావానికి, కుంభవృష్టికి దారితీస్తాయి. తుఫానుల క్రమంలోనూ మార్పులు వస్తాయి. ఫలితంగా చీడపీడలు, తెగుళ్లు, వ్యాధికారక క్రిములు విస్రృతంగా ఒక చోటి నుంచి మరో చోటికి వ్యాప్తి చెందుతాయి.

చీడపీడలు, తెగుళ్లు, వ్యాధుల సంబంధమైన మార్పులు

వ్యవసాయ జీవావరణ వ్యవస్థలలో నేల, మొక్కలు, జంతువుల మధ్య నిరంతర సంసర్గం, చలనశీలమైన సమతూకం అవసరం. ఈ జీవావరణ వ్యవస్థ సమతూకంలో వచ్చే మార్పులతోపాటూ చీడపీడలు, వ్యాధులలో కూడా మార్పులు రావడం కనబడుతుంది. పంటల పద్ధతులు, చీడపీడల నివారణ పద్ధతులలోని మార్పుల మూలంగా హానికరమైన, మేలుచేసే క్రిమికీటకాల మధ్య సహజమైన సమతూకం దెబ్బతినిపోతుంది. వాతావరణ మార్పులు నేరుగా చీడపీడలు పెరగడానికి దోహదం చేస్తాయి.
జీవరాశి అంతా అత్యంత పరిమితమైన ఉష్ణోగ్రతా పరిధుల మధ్యనే మనుగడ సాగించగలుగుతుంది. ఆవశ్యకమైన ఉష్ణోగ్రతా పరిధుల తర్వాత కొంత అవధి దాటిన వెంటనే ఆయా జాతుల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. సాధారణంగా హానికారకమైన క్రిమికీటకాలు, చీడ పీడలకంటే వాటిని ఆశించిబతికే మేలుకలుగజేసే క్రిమికీటకాలకు ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గులను తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, పచ్చదోమకు, దాన్ని ఆశించి బతికే పరాన్నభుక్కు సూక్ష్మ క్రిమికి మధ్య ‘తెగులు-సహజ శత్రువు’ సంబంధం ఉంది. పచ్చదోమకు దాని సహజ శత్రువుకంటే 17 రెట్లు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగల శక్తి ఉంది.
నేలకు సంబంధించిన క్రిమికీటకాలు చాలావరకు పొడి వాతావరణంలోనే బతుకుతాయి. అవి మొక్కల నుంచి స్వీకరించే ఆహారంతో పాటే వాటికి నీరు కూడా లభిస్తుంది. పంటలకు వచ్చే తెగుళ్లను నివారించడంలో ఈ క్రిమికీటకాలు కీలక పాత్రను నిర్వహిస్తాయి. అయితే అసాధారణమైన వేడిగాలి, వర్షాభావం వాటికి ప్రాణాంతకంగా మారుతుంది. తెలంగాణలోని గత రెండేళ్ల అసాధారణ వర్షాభావ పరిస్థితులలో ఆ కారణంగానే తాటాకు తెగులు ప్రబలింది.

ఆకులను, పళ్లను తిని బతికే గొంగళి పురుగుల స్థానే రసాన్ని పీల్చేసే తెగుళ్లు ప్రవేశించడం ఇటీవల కనిపిస్తోంది. ఒకే పంటను లేదా ఒకే రకాన్ని పండించడమూ, రసాయనిక క్రిమినాశనకారుల వాడకమూ ఈ మార్పునకు కారణం. ఉదాహరణకు, పత్తి విషయంలో ప్రత్యేకించి బీటీ పత్తిని ప్రవేశపెట్టిన తర్వాత పచ్చదోమ వంటి తెగుళ్లు ప్రబలుతున్నాయి. వేరుశనగకు పేనుబంక, తామరపురుగు, మిరప పంటకు పచ్చనల్లి తెగులు అలాగే వ్యాపించాయి. ఈ పీల్చేసే తెగుళ్లు, పలు వైరల్ వ్యాధులకు కారకాలుగా కూడా ఉంటున్నాయి. ఉదాహరణకు, వేరుశెనగకు మొవ్వకుళ్లు, పత్తికి ‘పొగాకు ఈనె వ్యాధి’ అలాగే సంక్రమించాయి. చాలా వరకు పళ్లు, కూరగాయలకు ఇలాంటి వైరల్ వ్యాధులే సంక్రమిస్తున్నాయి.

వాతావరణ మార్పులకు తట్టుకోవాలంటే?

మొక్కల జన్యువులు మొదలుకొని, జాతులు, జీవావరణ వ్యవస్థల వరకు సార్వత్రికమైన జీవవైవిధ్యాన్ని పెంపొందింపజేయడం ద్వారా వాతావరణంలో వస్తున్న మార్పుల దుష్ఫలితాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. జన్యుపరంగా భిన్నత్వం కలిగిన పంటలు, మొక్కలు, వివిధ జాతులతో సుసంపన్నమైన జీవావరణ వ్యవస్థలను నెలకొల్పడం ఇందులో కీలకం. దేశీయ, స్థానిక రకాల మొక్కలు, పంటలను, జంతువులను ఉపయోగించాలి. తద్వారా అసాధారణమైన పరిస్థితులను తట్టుకోగల రకరకాల పంటలు, జంతు జీవవైవిధ్యంపెంపొందుతాయి. రైతులు వాతావరణ మార్పులను తట్టుకోగలుగుతారు.

పెంపొందింపజేయాల్సిన పంటలు, జంతువులకు సంబంధించిన కృషిని వ్యవసాయ జీవావర ణ నిర్వహణా కృషి నుంచి వేరుచేయకూడదు. ఉదాహరణకు మన ప్రధాన ఆహార పంట అయిన వరిలో అధిక ఉష్ణోగ్రతలను, చౌడుదనాన్ని, దుర్భిక్షాన్ని, వరదలను తట్టుకునే శక్తి ఉన్న పలు రకాలు ఉన్నాయి. ఉదాహరణకు, 2004 సునామీ కారణంగా దెబ్బ తినిపోయిన పంట భూములలో అలాంటి రకాలను వాడి మంచి ఉత్పత్తిని సాధించవచ్చు. శ్రీవరి సాగు వంటి పద్ధతుల వల్ల నీటి వాడకం తగ్గడంతో పాటు 4 రెట్లు తక్కువ మిథేన్, 5 రెట్లు తక్కువ నైట్రస్ ఆక్సైడ్ విడుదల అవుతాయి.

వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులు అతివృష్టి కారణంగా సాగునీరు ఎక్కువయ్యే పరిస్థితులను, వర్షాభావం వల్ల ఏర్పడే నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకునేవిగా ఉండడం తప్పనిసరి. నేలలోని సేంద్రియ పదార్థమే ఈ రెండు సమస్యలకు కీలకం. అది నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది, స్థిరీకరిస్తుంది. తద్వారా పైపొర, భూసారం కొట్టుకుపోకుండానే, దిగువన ముంపునకు గురికాకుండానే నేలలు ఎక్కువ నీటిని పీల్చుకోగలుగుతాయి. ఎక్కువగా దున్నడం వలన భూసేంద్రియ పదార్థం క్షీణిస్తుంది. తక్కువగా దున్నడం, నేలను శాశ్వతంగా కప్పి ఉంచడం (పంటలు, పంట అవశేషాలతో లేదా నేలను కప్పే పంటలు) వల్ల భూ సేంద్రియ పదార్థం పెరుగుతుంది. అసలు దున్నకుండా వదిలేస్తే భూమి నిర్మాణంతో పాటూ దాని జీవజాలం కూడా చెక్కుచెదరకుండా ఉంటుంది. వానపాములు, చెదలు, వేళ్లు ఎక్కువ నీరు బయటికిపోయే మార్గాలుగా పనిచేస్తాయి. నేలను గడ్డితో కప్పి ఉంచడం నేలను అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుతుంది. పంటకు అవసరమయ్యే నీటిని 30 శాతానికి తగ్గిస్తుంది. అందువలన సేంద్రియ, జీవవారణ వ్యవసాయం నేలలోని జీవ సేంద్రియాలను పెంపొందింపజేసి, క్షార ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వ్యవసాయ వ్యయాలు తగ్గుతాయి.

ఉత్పత్తిలోని అస్థిరతలను తట్టుకోడానికి పలు నీటి నిర్వహణ పద్ధతులున్నాయి. భూసార పరిరక్షణ పద్ధతులు వర్షాభావ కాలాల్లో నేలలోని తేమను పెంచడానికి గణనీయంగా తోడ్పడతాయి. అతివృష్టి ప్రాంతాల్లో నేలను కప్పి ఉంచడం, దున్నకుండా సేద్యం చేయడం ద్వారా భూసారం కొట్టుకుపోకుండా కాపాడుకోవచ్చు. అయితే ఏడాదికి ఏడాదికి మధ్య అధిక వర్షపు నీటిని నిల్వ చేయడమనేదే సమర్థమైన నీటి నిర్వహణ పద్ధతి. ఇక పశువుల పెంపకంలో మార్పులు తేవడం ద్వారా గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల సమస్య ప్రభావాన్ని పరిహరించగలుగుతాం. బయోగ్యాస్ తదితర పద్ధతుల ద్వారా వ్యర్థాల నిర్వహణను చేపట్టాలి. వాతావరణ మార్పుల దుష్ర్పభావానికి ఎక్కువగా గురయ్యేది పేద రైతులే, కాబట్టి వాతావరణంలోని అసాధారణ మార్పులను తట్టుకునే పద్ధతులు వారికి ఎక్కువగా అవసరం. జీవావరణ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, క్రిమిసంహారక మందులు లేని వ్యవసాయం, శ్రీసాగు తదితర పద్ధతులతో కూడిన సుస్థిర వ్యవసాయం అటు రైతుకు, వినియోగదారునికి కూడా లాభదాయకం. అంతేకాదు, వాతావరణ మార్పులను ఉపశమించేది కూడా అదే!

Comments

Posted in Articles, Ramoo blog, తెలుగు and tagged .

Leave a Reply