దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ

మీ ప్రాంతంలోని రైతు సోదరులకు ఈ సంస్థ గురించి తెలియజేయండి

నాలుగు రోజుల క్రితం  అనంతపురం పట్టణానికి సమీపంలోని గార్లదిన్నె దగ్గర ఉన్నభారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారిచే నడుపబడే “దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థను” సందర్శించడం జరిగింది.స్నేహితులొకరు దాదాపు 12 సంవత్సరాలు అమెరికాలో పనిచేసి తిరిగి మళ్ళీ మన దేశంలో పూణే నగరంలో రెండేళ్ళు నెలకు ఆరు అంకెల మంచి జీతంతో పనిచేస్తూ వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగాన్ని వదలి ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర తన స్వంత గ్రామానికి దగ్గరగా పొలం తీసుకుని వ్యవసాయం ప్రారంభించారు.రైతులు ,వినియోగదారులూ మరచిపోతున్న జొన్న,సజ్జ,కొర్రలాంటి తృణధాన్యాలను పండించి  వాటి విలువను గురించి ప్రజలలో అవగాహన తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.ఆ వ్యవసాయంతో పాటుగా  ఆవులను కొనుగోలు చేసి డైరీ కూడా ప్రారంభించారు.సేంద్రియ ఎరువును మాత్రం(సాధ్యమయినంతవరకు)వాడుతూ క్రిమి సంహారక మందులు వాడకుండా పర్యావరణానికి హాని చేయని సహజ పద్దతులు పాటిస్తూ వ్యవసాయం సాగిస్తున్నారు.

మనం ఎలాంటి వారమంటే మన దగ్గరున్న,మన ప్రాంతంలో పండుతున్నఈ తృణధాన్యాలను విస్మరించి విదేశాలనుంచి దిగుమతి అవుతున్న ఓట్స్ గురించి అత్యంత శ్రద్ధ తీసుకుని వాటి గురించి ప్రచారం చేస్తూ మధుమేహవ్యాధిగ్రస్తులకు మేలైన ఆహారమంటూ మనకు మనమే ప్రచారం చేస్తూ వాటిని వాడుతున్నాము.మధుమేహవ్యాధిగ్రస్తులకు జొన్నరొట్టె,జొన్నన్నము,రాగి సంగటి,కొర్రన్నము  కన్నా మించిన ఆహారం వేరే లేదు .ప్రజలకు  ఈ విషయం తెలియజేసే దిశగా ప్రభుత్వం,ఆహార నిపుణులు దృష్టి పెట్టడంలేదు .

దిగిన తర్వాతగానీ లోతు తెలియలేదన్నట్లు వ్యవసాయంలో దిగిన తర్వాతే  తెలిసిందిమా మా మిత్రునికి భారద్దేశంలో వ్యవసాయం ఎగసాయమని.రైతు పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అని.ప్రభుత్వంవారు గొప్పగా చెప్పుకునే  ఆహారానికి పని పథకంవల్ల కాదు కాదు పనికి ఆహారపథకంవల్ల కూలీల సమస్య ఎదురై వ్యవసాయంలో యాంత్రీకరణను ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావించి వాటి గురించి శిక్షణ,అవగాహన కలిగిస్తున్నఈ సంస్థ గురించి తెలుసుకుని ఇక్కడకు వచ్చారు వారితో పాటుగా ,వారికి సహాయంగా నేనూ వెళ్ళాను.ఆధునిక వ్యవసాయాన్ని సులభ పద్ధతుల్లో వివరిస్తూ రైతులకు తగిన శిక్షణనిస్తూ,ప్రస్తుతం సేద్యంలో ముఖ్య పాత్ర వహించే ట్రాక్టర్,దాని అనుబంధ పరికరాలను గురించి శిక్షణ ఇచ్చే సంస్థను దక్షిణ భారత రైతు సోదరులకోసం 1983సంవత్సరంలో అనంతపురం జిల్లా గార్లదిన్నె కేంద్రానికి 5కి.మీ దూరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.దేశంలో మిగిలిన మూడు ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంస్థలనే స్థాపించింది.మధ్యభారతానికిబుధినిలో,ఉత్తరభారతానికి హర్యానాలో,ఈశాన్య రాష్ట్రాలకోసం అసోం రాష్ట్రంలోని బిశ్వంత్ చెరోలీలో ఏర్పాటు చేసారు.http://farmech.gov.in/

సంస్థ గురించి ,సంస్థ లక్ష్యాల గురించి,వ్యవసాయ యంత్రాలు,వాటి వాడకం గురించి  సంస్థ ఉద్యోగి శ్రీ కనకప్పగారు తమ అమూల్యమయిన సమయాన్ని మాకు కేటాయించి  చక్కగా వివరించి చెప్పారు.ఏ ప్రాంత రైతులయినా ఒక గ్రూపుగా వస్తే వారికి ప్రాధాన్యమిచ్చి చక్కటి శిక్షణను అందజేస్తామని తెలియజేసారు.

వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి రైతుల అవసరాలకు తగినట్లుగా వివిధ యంత్రాల ఎంపిక,మరమ్మత్తులు,ఉపయోగించే పద్ధతులు,యాజమాన్యంపై రైతులకు,సాంకేతిక విద్యార్హతలు కలవారికి,ట్రాక్టర్లు,వ్యవసాయ యంత్రాల వినియోగదారులకు,ఉత్పత్తిదారులకు,విక్రేతల సిబ్బందికి,రైతు మహిళలకు వివిధ రకాల శిక్షణా తరగతులు ఇక్కడ నిర్వహిస్తారు.

అంతే కాకుండా భారత ప్రభుత్వంవారి(B.I.S)వారి నిర్ధేశిత నాణ్యతా సూత్రాలకు అనుగుణంగా,దేశంలో  ఉత్పత్తి అవుతున్న వివిధ వ్యవసాయ యంత్రాలు,ఇంజన్లు,పంపులు,పవర్ టిల్లర్ల నాణ్యతను ,మన్నికను పరీక్షించి,వినియోగదారులకు నాణ్యమైన పరికరాలు లభ్యమయ్యేటట్లు చేయడం కూడ సంస్థ మరో ఉద్దేశ్యం.

తనకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఈ సంస్థ ఎన్నో శిక్షణా తరగతులు నిర్వహిస్తూ రైతులు,విద్యార్థులు,మహిళలకు వ్యవసాయ యాంత్రీకరణలో పరిపూర్ణ విజ్ఞానాన్ని అందించుటలో తోడ్పడుచున్నది.రైతాంగానికి వ్యవసాయ రంగంలో ఆధునిక పరికరాలతో,
ట్రాక్టర్లతో సులభ పద్దతిలో క్రమశిక్షణతో నేర్పించి,రైతులను అభివృద్ధి దశలోకి తీసుకురావటం ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం.

కోర్సుల వివరాలు:
1.యూజర్ లెవల్ కోర్సులు(యు-సీరిస్)
 • 1.వ్యవసాయంలో శక్తి వినియోగం 4వారాలు
 • 2.వివిధ వ్యవసాయ యంత్రాల ఎంపిక,వినియోగించే విధానం,జాగ్రత్త చర్యలు వాటి యాజమాన్యంపై శిక్షణ 6వారాలు
 • 3.పవర్ టిల్లర్లను నడుపుట,వాటి యాజమాన్యంపై శిక్షణ 2వారాలు
 • 4.మహిళా రైతులకు వివిధ వ్యవసాయ పనిముట్లపై శిక్షణ 3రోజులు
 • 5.బిందు,తుంపర్ల సేద్యం,వినియోగం,యాజమాన్యంపై శిక్షణ 1వారం
 • 6.సస్యరక్షణ పరికరాల ఎంపిక,వాటి వినియోగ విధానంపై శిక్షణ 1వారం
 • 7.చేతిపంపుల ఎంపిక,వాటి వినియోగం,యాజమాన్యంపై శిక్షణ 1వారం
 • 8.మెట్ట సేద్య వ్యవసాయ యంత్రాల ఎంపిక,వాటి నిర్వహణ,యాజమాన్యంపై శిక్షణ 2వారాలు
 • 9.పప్పు,నూనె ధాన్యాల పంటల ఉత్పత్తి,ఉపయోగించే వివిధ రకాల యంత్రాలపై శిక్షణ 1వారం
 • 10.వరిసాగులో ఉపయోగించే వివిధ రకాల యంత్రాలపై శిక్షణ 1వారం
ప్రవేశానికి అర్హతలు:
 • 1.కనీసం 8తరగతి వరకు చదివి ఉండాలి.
 • 2.వయస్సు 18సం.లు నిండి ఉండాలి.
 • 3.పొలము,వ్యవసాయ యంత్రములు కలిగిన వారికి ప్రాధాన్యమివ్వబడును.
ఈ కోర్సులన్నీ పూర్తిగా ఉచితం.

పై కోర్సులలో శిక్షణ పొందు విద్యార్థులకు నెలకు రూ.1200లు ఉపకార వేతనం కూడా ఇవ్వబడును.
శిక్షణలో చేరుటకు,శిక్షణ తర్వాత వారి స్వగ్రామం చేరడానికి బస్సు/రైలు కనీస చార్జీలు కూడా ఇస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తు ఫారాలను 20రూ.స్వయంగాగానీ,M.Oద్వారాగానీ చెల్లించి శని, ఆదివారాలు తప్పించి అన్ని పనిరోజులలో సంస్థ ద్వారా పొందవచ్చు.పూర్తి చేసిన ఫారాలను తగిన ప్రమాణ పత్రాలను జతపరచి ప్రారంభ తేదీకి కనీసం
నెలన్నరరోజులకు ముందుగా సంస్థ చిరునామాకు పంపవలెను.

2.టెక్నీషియన్ లెవల్ కోర్సులు(టి.సీరిస్)
 • 1.ట్రాక్టర్,డీజిల్ ఇంజన్ల మరమ్మత్తులపై శిక్షణ                                                        6వారాలు
 •  2.పవర్ టిల్లర్ మరమ్మత్తులపై శిక్షణ                                                                   2వారాలు
 •  3.వ్యవసాయ యంత్రాలు,హైడ్రాలిక్ సిస్టమ్‍పై ప్రత్యేక శిక్షణ                                      4వారాలు
 •  4.ఆటో ఎలక్ట్రికల్ పరికరాల,బ్యాటరీ మరమ్మత్తులపై శిక్షణ                                      3వారాలు
 •  5.భూమి చదును,వృద్ధి చేసే యంత్రాల నిర్వహణ,బుల్‍డోజర్ యాజమాన్యంపై శిక్షణ 4వారాలు
ప్రవేశార్హతలు:
 • 1.ఐ.టి.ఐ(డీజల్/మోటార్ మెకానిక్) కోర్సు పూర్తి చేసి ఉండాలి.
 • 2.వయస్సు 18సం.లు నిండి ఉండాలి.
 • 3.ఫీజు వారానికి రూ.50/-లు చొప్పున చెల్లించాలి.

దరఖాస్తుదారులు తమ పూర్తి వివరాలు,పేరు,చిరునామా,విద్యార్హతలు తెలియజేస్తూ తగిన ప్రమాణ పత్రాలను జతపరచి ప్రారంభ తేదీకి కనీసం
నెలన్నరరోజులకు ముందుగా సంస్థ చిరునామాకు పంపవలెను.

యాజమాన్య శిక్షణా తరగతులు:

వ్యవసాయ యంత్రాల ఉత్పత్తి దారులు/డీజల్ మెకానిక్‍లకు శిక్షణ        1వారం

విద్యార్థుల శిక్షణా కార్యక్రమాలు:
 • 1.డిగ్రీ/డిప్లొమా విద్యార్థులకు వ్యవసాయ యంత్రాల వినియోగంపై ప్రాక్టికల్ శిక్షణ                   4వారాలు
 • 2.ఐ.టి.ఐ/ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులకు వ్యవసాయ యంత్రాల వినియోగంపై శిక్షణ 4వారాలు
అవసరాలకు అనుగుణ్యమైన కోర్సులు:
 • 1.వ్యవసాయ యంత్రాల వినియోగంపై అవసరాలకు అనుగుణ్యమైన శిక్షణా తరగతులు గ్రామం/మండల కేంద్రాలలో శిక్షణా తరగతులు                                                                                   1-2రోజులు
 • 2.ఆధునిక వ్యవసాయ యంత్రాల గురించిన అవగాహన మరియు ప్రదర్శన                    1-2రోజులు

పైన పేర్కొన్న వివిధ రకాల శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు కావలసిన సదుపాయాలు ఈ శిక్షణా సంస్థలో లభ్యమవుతున్నాయి.
అవి
1.ట్రాక్టర్ అంతర్గత నిర్మాణాల ప్రదర్శనశాల
2.ట్రాక్టర్ హైడ్రాలిక్ విధానం ప్రదర్శనశాల
3.ఇంజన్ల ప్రదర్శనశాల
4.సస్యరక్షణ పరికరాల ప్రదర్శనశాల
5.నీటి పారుదల యంత్రాల ప్రదర్శనశాల
6.విద్యుత్ పరికరాల ప్రదర్శనశాల
7.విద్యుత్ డమ్మీ యంత్రాల ప్రదర్శనశాల
8.రైతు మహిళా వ్యవసాయ పరికరాల ప్రదర్శనశాల
9.సాంప్రదాయేతర ఇంధనముల పరికరాల ప్రదర్శనశాల
10.దృశ్య,శ్రవణ కేంద్రము
11.వ్యవసాయ యంత్రాల సంగ్రహాలయము
12.మెట్ట సేద్య వ్యవసాయ యంత్రాల ప్రదర్శనశాల
13.విభిన్న రకాలైన వ్యవసాయ యంత్రాల ప్రదర్శనా క్షేత్రము

శిక్షణా కాలంలో అభ్యర్థులకు వసతి సదుపాయాలు:

1.వసతి గృహము:శిక్షణ పొందు విద్యార్థులకు అన్ని సౌకర్యములుగల అధునాతన వసతి గృహము కలదు.
ఇందులో సుమారు వందమంది విద్యార్థులకు ఉచిత సౌకర్యము కల్పించడమైనది.భోజన వసతి కూడా కలదు కానీ భోజన ఖర్చులు విద్యార్థులే భరించవలసి ఉన్నది.కాలక్షేపానికి టెలివిజన్
మరియు ఆటలాడుకొనేటందుకు కావలసిన పరికరాలు సమకూర్చబడినవి.
2.ఆరోగ్య కేంద్రము:ఉచిత ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసారు.
3.విజ్ఞాన సమాచార కేంద్రం:వివిధ భాషలలో వ్యవసాయ విజ్ఞానము,తదితర రంగాలకు,విభాగాలకు సంబంధించిన కొన్నివేల గ్రంథాలు,దిన,వార,మాసపత్రికలు మరియు జాతీయ,అంతర్జాతీయ
శాస్త్ర విజ్ఞాన పత్రికలు లభ్యమవుతున్న విజ్ఞాన సమాచార కేంద్రం కలదు.
4.దృశ్య శ్రవణ యంత్ర ప్రదర్శనశాల: విద్యార్థులకు దృశ్య,శ్రవణ యంత్రాలు,మల్టీమీడియా ద్వారా,విడియో క్యాసెట్స్,సీ.డీలు సేకరించి ప్రదర్శించుటకు తగిన సౌకర్యములు కలవు.

చిత్రాలు తరువాతి టపాలో

సంస్థ ఇ-మెయిల్ అడ్రస్:fmti_sr@nic.in
వెబ్ సైట్ :www.dacnet.nic.in/srfmtti

Comments

Posted in Technology, తెలుగు and tagged , .

Leave a Reply