వ్యవసాయ బడ్జెట్ ఎప్పుడు? – సుస్థిర వ్యవసాయ కేంద్రం

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేడు 2012-13 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయరంగంలో నెలకొనివున్న విషాద, విపత్కర పరిస్థితులను గుర్తు చేయక తప్పదు. క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం 2010లో రాష్ట్ర వ్యాప్తంగా 2,525 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడాది కేవలం అక్టోబర్-నవంబర్ నెలల్లో 156 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు తెలియజేస్తున్నాయి. వ్యవసాయరంగంలో నెలకొన్న సంక్షోభానికి రైతుల ఆత్మహత్యలు ఒక చిన్న ప్రతీక మాత్రమే. పెట్టుబడులు పెరిగిపోయి, ధరలు గిట్టుబాటు కాని పరిస్థితిలో దాదాపు 85వేల ఎకరాలలో రైతులు ‘పంట విరామం’ ప్రకటించారు.

విస్తృత ప్రచారంలోకి రాకుండా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించిన భూముల విస్తీర్ణం మరింత ఎక్కువ ఉంటుంది. రైతులను కృంగదీస్తోన్న వివిధ సమస్యలపై రైతు స్వరాజ్య వేదిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం, ఆక్స్‌ఫామ్ ఇండియాలు సంయుక్తంగా ఈ నెల 6న హైదరాబాద్‌లోని ‘సెస్’లో (సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్)లో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి.

వడ్డే శోభనాద్రీశ్వరరావు (మాజీ వ్యవసాయ శాఖ మంత్రి), సారంపల్లి మల్లారెడ్డి (ఆలిండియా కిసాన్ సభ), వెంకటేశ్వర్లు (ప్లానింగ్ విభాగం, వ్యవసాయ శాఖ), కె.ఆర్.చౌదరి (రిటైర్డ్ ప్రొఫెసర్), ప్రొ. అల్తాస్ జానయ్య (వ్యవసాయ విశ్వవిద్యాలయం), ప్రొ.రమణమూర్తి (కేంద్రీయ విశ్వవిద్యాలయం), డాక్టర్ జి.వి.రామాంజనేయులు (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయకేంద్రం) విస్సా కిరణ్ కుమార్ (కో ఆర్డినేటర్, రైతు స్వరాజ్యవేదిక), సుధాకర్ (ఆక్స్‌ఫామ్ ఇండియా)లతో సహా వివిధ రాజకీయ పక్షాల, రైతు సంఘాల, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యవసాయరంగ నిపుణులు, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.

గత రాష్ట్ర బడ్జెట్‌లలో వ్యవసాయరంగానికి, అనుబంధరంగాలకు చేసిన కేటాయింపులు, అవి ఖర్చు అయిన తీరును చర్చించారు. రాష్ట్రంలోని చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతుల ఆదాయాలు పెరిగేలా, వారి కుటుంబ జీవన స్థితిగతులు మెరుగుపడేలా విధానాలు రూపొందాలని, అందుకనుగుణంగా బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులు పెరగాలని, లక్ష్యసాధన దిశలో ఈ కేటాయింపులన్నీ సమర్థంగా వినియోగించబడాలని సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు. ఆయా అంశాలపై వారి అభిప్రాయాలు, ప్రతిపాదనలను క్లుప్తంగా చూద్దాం.

రాష్ట్రంలోను, దేశంలోనూ వ్యవసాయదారులందరినీ పీడిస్తున్న సమస్య ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడమూ, వాటికీ పంటకు లభించే మద్దతు ధరలకూ పొంతన లేకపోవడమూ. వ్యవసాయం లాభదాయకంగా ఉండాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం లాభంతో కనీస మద్దతు ధరలు ప్రకటించాలని మనమందరమూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇంతకాలం డిమాండ్ చేస్తూ వచ్చాం. కానీ అది జరగలేదు. అయితే దీనిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు బాధ్యత తీసుకోవాలి.

వరి మద్దతు ధర క్వింటాలుకు రూ.2770 ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్ర ధరలు, వ్యయాల కమిషన్‌కు సిఫార్సు చేస్తే కేంద్రం క్వింటాలుకు రూ.1080 మాత్రమే నిర్ణయించింది. రైతులకు జరుగుతున్న ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి కొంతవరకైనా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడే రైతులకు కొంత వరకు న్యాయం జరుగుతుంది.

ప్రభుత్వం అందించే సహకారం ఎక్కువగా పర్యావరణ పరంగా విధ్వంసం సృష్టిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులు, హైబ్రిడ్/ జన్యు మార్పిడి పంటల విత్తనాలు, సంకర జాతి పశువుల వైపే వుంటోంది. వీటి వలన రైతులకు ఖర్చులు పెరగటంతో పాటు మారుతున్న శీతోష్ణ స్థితితో నష్టాలు కూడా పెరుగుతున్నాయి. కనుక భూసారం జాతీయ ఆస్తిగా గుర్తించి, దానిని పెంచటం కోసం ప్రభు త్వం సరైన ప్రోత్సాహకాలు అందించాలి. వర్షాధార ప్రాంతాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతానికి అనుకూలమైన పంటలు, పంటలలో భిన్నత్వం, ప్రతి రైతుకి కనీసం ఒకటి లేదా రెండు ఎకరాలకు సాగునీరు లభించే ఏర్పాటు చేయాలి.

రైతుల అసంఘటితంగా ఉండి, ఎవరి పద్ధతులలో వారు సేద్యం చేయడం వలన తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. పంటల ఉత్పత్తి ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. సంస్థాగత సహాయం కూడా వారికి సరిగా అందడం లేదు. తమ ఉత్పత్తులను కూడా గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేక దోపిడీకి గురవుతున్నారు. సహజ వనరులు ఎవరికీ అందుబాటులో లేక పంటనష్టాలను పొందుతున్నారు.

ఎవరికి వారు బోరు బావులు తవ్వుకుంటూ పోవడం వలన ఆర్థికంగా అప్పుల పాలవుతున్నారు. ఇటువంటి కారణాలను చూపి కొంత మంది చిన్న రైతులు, చిన్న కమతాల వ్యవసాయం గిట్టుబాటు కాదని ప్రచారం చేస్తున్నారు. సాగు భూములను కాంట్రాక్ట్, కార్పొరేట్ వ్యవసాయానికి అప్పగించి, చిన్న, సన్నకారు రైతులు వేరే ఉపాధిని చూసుకోవాలని బోధిస్తున్నారు. ఈ ప్రతిపాదన ఆత్మహత్యా సదృశ్యమైనది.

ప్రస్తుతం వ్యవసాయ పరిశోధన, విస్తరణ వ్యవస్థను పటిష్ఠం చేయాలి. ఇందుకు ప్రతి 1000 హెక్టార్లకు కనీసం ఒక ఎఇఓ స్థాయి విస్తరణ అధికారిని నియమించాలి. అంటే రాష్ట్రం మొత్తం మీద పదివేల మంది ఎఇఓలు ఉండాలి. వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో నిధుల లేమి వల్ల పరిశోధనలు కుంటుపడుతున్నాయి. పరిశోధనలకు నిధులను భారీగా పెంచాలి. పరిశోధన నిధులలో కనీసం 50 శాతం సేంద్రియ సుస్థిర వ్యవసాయ పద్ధతులపై ఖర్చుపెట్టాలి. ప్రతి ఏటా రైతు కుటుంబాల ఆర్థికస్థితిపై, జీవనగతిపై ప్రత్యేక నివేదికను ప్రభుత్వం రూపొందించి విడుదల చేయాలి.

వ్యవసాయంలో ముఖ్య వనరైన విత్తనాలపై ప్రభుత్వ నియంత్రణ కరువవటంతో రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ పూర్తిగా నిర్వీర్యమయింది. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన పంటరకాలు, హైబ్రిడ్లు రైతులకు అందటం లేదు. పత్తి, మొక్కజొన్న లాంటి పంటలలో ఈ సమస్య మరింత తీవ్రంగా వుంది. అలాగే విత్తన నాణ్యత విషయంలోనూ, ధరల విషయంలోనూ నియంత్రణ లేకపోవడం వలన కంపెనీలు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకుంటున్నాయి. నాణ్యతలేని విత్తనాలతో రైతులు మోసపోతున్నారు.

వ్యవసాయం చేస్తున్న సాగుదారులందరికీ సంస్థాగత రుణ సౌకర్యం అందడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ రుణ అవసరాలలో కేవలం 27 శాతం మాత్రమే సంస్థాగత రుణాలు తీరుతున్నాయి. కనుక బ్యాంకులు పంట రుణాలు పూర్తిగా వాస్తవ సాగుదారుకే ఇవ్వాలి. అది కూడా పంటల సీజన్ ప్రారంభం కాకముందే రుణాలు అందాలి. వివిధ పంటలకు వాస్తవ ఉత్పత్తి ఖర్చుల ఆధారంగా బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిర్ణయించి రుణాలను ఇవ్వాలి.

ఈ విషయంలో ప్రాంతాల పరంగా ఉన్న వ్యత్యాసాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. వసూలుకు హామీ అడుగుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం హామీ ఇవ్వకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేయవు. ప్రభుత్వం కౌలు రైతుల రుణాలకు హామీగా కౌంటర్ గ్యారంటీ ఇవ్వటానికి బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలి.

అన్ని జిల్లాల్లో, అన్ని పంటలకు, అందరు రైతులకు సర్వే నెంబరు ప్రాతిపదికగా బీమా పథకం అమలు కావాలి. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ బీమా పథకాన్ని అమలు పరచాలి. బీమా నాలుగు దశలలో అమలుచేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలి (విత్తిన 30 రోజులలోపు, పంట సస్యరక్షణ దశలో, పంట చివరి దశలో, పంటకోతల అనంతరం).

ఆయా దశలకు గాను కనీస ప్రీమియంను నిర్ణయించాలి. స్థానికంగా ఉండే మహిళా స్వయం సహాయక బృందాలను లేదా స్థానికంగా ఉండే సహకార సంఘాలను ఉపయోగించుకుని రైతుల (వాస్తవ సాగుదారుల) పేర్లను, సాగుచేసిన పంటలను, పంటల విస్తీర్ణాన్ని నమోదుచేయాలి. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలి. మధ్యతరగతి, పెద్ద రైతులు సాగుచేసిన పంటలకు గాను ప్రీమియం మొత్తంలో సగ భాగాన్ని మాత్రమే రైతుల నుంచి వసూలు చేయాలి. మిగిలిన సగభాగాన్ని ప్రభుత్వాలు భరించాలి. వాణిజ్య, ఉద్యాన పంటలకు కూడా ప్రస్తుతమున్న ప్రీమియం రేట్లను తగ్గించాలి.

ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు జరుగు పంట నష్టాన్ని అంచనా వేయడంలో విపరీతమైన ఆలస్యం జరుగుతున్నది. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు నష్టం అంచనాలను రూపొందించడానికి నెలలు గడుస్తున్నాయి. రూపొందించిన నివేదికను కేంద్రానికి పంపితే, అక్కడి నుంచి కేంద్ర బృందం వచ్చి పరిశీలించి నివేదికను రూపొందించేందుకు మరికొన్ని నెలలు గడుస్తున్నది.

ఈ లోపు నష్టపోయిన రైతులకు ఏ పరిహారమూ అందడం లేదు. కేవలం కేంద్ర బృందం అందజేసే సహాయం కోసం ఎదురు చూడడం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇందుకోసం ఖర్చు చేయడం లేదు. ఈ వైఖరి రైతులను మరింత కుంగదీస్తున్నది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం సంభవించినప్పుడు, వెంటనే రైతులను ఆదుకునేందుకు అవసరమైన నిధిని రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించాలి.

మన రైతుల్లో అత్యంత దుర్భరస్థితిలో ఉన్న వర్గం కౌలు రైతులదే. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో కూడా అత్యధికులు వారే. భూసంస్కరణల చట్టాన్ని సమగ్రంగా అమలుచేసి మిగులుభూమిని భూమిలేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు అందుబాటులోకి తేవాలి. రాష్ట్ర వ్యాపితంగా ఉన్న కౌలు రైతులను సాగుదారులుగా గుర్తించి పాస్ బుక్‌లను ఇవ్వాలి. కౌలురైతుల చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను తొలగించి కౌలురేట్లపై పూర్తిస్థాయి నియంత్రణ విధించాలి. కౌలు రైతులకు రుణాలతో నిమిత్తం లేకుండా పంటల బీమా లభించాలి. అదే విధంగా పంటల నష్టపరిహారం కౌలు రైతులకు అందేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సహాయం చేయాలి.

జీవో నెం 421లో రైతు ఆత్మహత్యలను సత్వరమే గుర్తించి నెల రోజులలోగా నిర్ధారణ చేసే నిబంధన తేవాలి. ఈ విషయంలో రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ సమన్వయంతో బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలి. జీవో 421/2004ను అమలు చేసే నిబంధనలను సవరించి (ప్రస్తుత నిబంధన ప్రకారం రైతు కుటుంబం 13 డాక్యుమెంట్లు సమర్పించాలి) గ్రామ సభ ద్వారా ఆత్మహత్యకు కారణం, అప్పులు తదితర విషయాలపై సత్వరంగా నిర్ధారణ జరిపే ప్రక్రియను ఏర్పాటుచేయాలి. రూ.100 కోట్లతో వ్యవసాయదారుల సంక్షేమ నిధిని ఏర్పాటుచేయాలి.

రౌండ్ టేబుల్ సమావేశం ఆమోదించిన ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. వ్యవసాయానికి, దాని అనుబంధరంగాలకు ప్రత్యేక ఆర్థిక సర్వే, బడ్జెట్ ప్రవేశపెట్టాలి (ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌లు ప్రవేశపెట్టాయి); వ్యవసాయ, అనుబంధ రంగాలకు (సాగునీటి రంగం కాకుండా) బడ్జెట్‌లో కనీసం 20 శాతం కేటాయించాలి; రా ష్ట్ర స్థాయిలో ధరల, వ్యయాల కమిషన్ ఏర్పాటు చేయాలి. వ్యవసా య, అనుబంధరంగాల మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లతో ప్రత్యేక క్యాబినెట్ ఏర్పాటు చేయాలి. ఈ ప్రతిపాదనలపై అందరూ చర్చించాలి. వాటిని మరింత సమగ్రపరచి, రైతు, రైతుకూలీ సమాజానికి మేలు చేసే విధంగా రూపొందించాలి. వాటిని అమలుచేసేలా ప్రభుత్వంపై ఉమ్మడిగా ఒత్తిడి తెద్దాం.

– సుస్థిర వ్యవసాయ కేంద్రం
హైదరాబాద్
(ఫిబ్రవరి 6, 2012 నాడు జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం ప్రతిపాదనల ఆధారంగా)

 

Comments

Posted in Articles and tagged , .

Leave a Reply