రైతన్నకు బొంద చూపిన ‘కందా’!

http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=27819&Categoryid=1&subcatid=18

ఆరేడేళ్లకు ముందు రోజుల్లో వ్యవసాయం నిజంగా దండగే అన్న అప్పటి నికృష్ట రాజకీయాన్ని, క్షుద్రపరిభాషను అధిగమించాలని రైతులు అనుకుంటుండగా, మరచిపోయిన రోజులు మళ్లీ వారి జీవితాల్లో పునరావృతం అవుతున్నాయి. ఆ తరువాత వరప్రసాదంలా సంభవించిన వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు రాజ్యంలో వ్యవసాయం దండగ కానే కాదు పండగే అని రైతులు నమ్మిన రోజులు ఇంత త్వరగా ఆ ప్రజానాయకుని నిష్ర్కమణతో ముగిసిపోయాయా? ఇది నిజమేనా? అని రైతన్న కలవరపడుతున్నాడు.

ప్రమాదపు అంచుల నుండి తమను రక్షిం చమని, నష్టాల కష్టాలలో ఉన్న తమను ఆదు కోమని రైతులు సుమారు నాలుగైదు నెలల క్రితమే మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందిం చలేదు. ఫలితంగా కోనసీమలో లక్ష హెక్టార్లకు పైగా పంట సెలవు ప్రకటించిన రైతులు మూడు నుండి నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ సంవత్సరం కేవలం మొదటి పంట సీజన్‌లోనే కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ధాన్యం ఉత్పత్తిలో ఏ మాత్రం తగ్గుదల ఉండదని, ఇంకా పెరుగుతుందని చెప్పే ప్రభుత్వ మొండి వైఖరిని చూసి రాష్ట్రంలోని సగటు మానవుడు విస్తుపోతున్నాడు. ప్రభుత్వం ఏర్పరచిన మోహన్‌కందా కమిటీ సమస్య పరిష్కార దిశగా నివేదిక రూపొందిస్తుందనుకొన్న కోనసీమ రైతులకు నిరాశే మిగిలింది. ధాన్యానికి కనీస మద్దతు ధర అందక తమ దారిద్య్రానికి కారణం ఎవరో తెలిసినా వినే నాథుడు లేక, అప్పుల ఊబిలో నానాటికీ కూరుకుపోతూ దిక్కుతోచని స్థితిలో రైతన్న పంట సెలవు ప్రకటించాడు. కష్టం చేయకుండా మిన్నకుండిపోవటం తమ నైజానికి విరుద్ధమైనా పంట సాగుచేస్తే, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందేమోనన్న భీతి చెంది పంట సాగుకు సెలవు ప్రకటించిన రైతులకు ఈ కమిటీ నియామకం చిమ్మచీకటిలో ఒక చిరుదీపంలా కనిపిం చింది. అయితే కమిటీ సిఫార్సులు వెలుగులోకి వచ్చిన మరుక్షణం రైతులు హతాశులయ్యారు. దళారులు తమకు దక్కవలసిన ఫలాలను తన్నుకొనిపోతుంటే, ప్రభుత్వం చేష్టలుడిగి అలసత్వాన్ని ప్రదర్శిస్తుంటే కమిటీ నివేదిక రైతులకు ఊరట ఇస్తుందన్న ఆశ అడియాసగా మిగిలిపోయింది. కష్టాలు కడతేరతాయనుకున్న రైతన్నల ఆశాభావాన్ని నిర్దయగా నీరుగార్చిన నిరుపయోగమైన నివేదికగా తేలిపోయింది.

కందా కమిటీ అన్ని ముఖ్యమైన సమస్యల విషయంలో మౌనం వహించిందని, లేదా సమస్యకు తగిన సిఫార్సులను ఇవ్వటంలో ఘోరంగా విఫలమైందని రైతులు భావిస్తున్నారు. ఆరేడేళ్లకు ముందు రోజుల్లో వ్యవసాయం నిజంగా దండగే అన్న అప్పటి నికృష్ట రాజకీయాన్ని, క్షుద్ర పరిభాషను అధిగమించాలని రైతులు అనుకుంటుండగా, మరచిపోయిన రోజులు మళ్లీ వారి జీవితాల్లో పునరావృతం అవుతున్నాయి. ఆ తరువాత వర ప్రసాదంలా సంభవించిన వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు రాజ్యంలో వ్యవసాయం దండగ కానే కాదు పండగే అని రైతులు నమ్మిన రోజులు ఇంత త్వరగా ఆ ప్రజా నాయకుని నిష్ర్కమణతో ముగిసిపోయాయా? ఇది నిజమేనా? అని రైతన్న కలవరపడుతున్నాడు.

కందా కమిటీ నివేదికకు రైతుల నుంచి ఇంతకూ ఇటువంటి ప్రతిస్పందన ఎందుకు వస్తున్నదో ఇప్పుడు చూద్దాం. మద్దతు ధర, గిట్టుబాటు ధరలపై నిర్ణయాలతో రైతు సమస్యలు తీరవని, నిజమైన లాభాలు ఖర్చు తగ్గించుకోవ టంలోనే ఉన్నాయని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది. ఇందుకోసం కమిటీ కొన్ని ఉచిత సలహాలు రైతులకు అందించింది. రైతులు పంటమార్పిడి చేయాలని, రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, యాంత్రీకరణతో వ్యవ సాయ కూలీలకయ్యే ఖర్చు మీద పట్టుసాధించుకోవచ్చునని కమిటీ అభిప్రా యపడింది. కేవలం మద్దతు ధరపై నెలకొని ఉన్న సందిగ్ధ పరిస్థితిని సమీక్ష చేసేందుకు కమిటీ పరిమితమైనట్లు కనిపిస్తున్నది.

ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధి లోని అంశం కాదని అయినా రాష్ట్ర ప్రభుత్వం 200 రూపాయల మేర పెంపుద లకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించిందని, భారత ప్రభుత్వం దీనికి పాక్షికంగా ప్రతిస్పందిస్తూ ఖరీఫ్ 2011 నుంచి క్వింటాలు ఒక్కింటికి 80 రూపాయలు పెంచిందని సెలవిచ్చింది. రాష్ర్ట ప్రభుత్వం తమ వైఖరి ప్రక టిస్తూ ఎక్కువ బోనస్ ప్రకటించాలని ప్రధానమంత్రిని లేఖ ద్వారా అర్ధించి నట్లు చెప్పుకొచ్చింది. ఇతర రాష్ట్రాలలో అనుసరిస్తున్న పద్ధతిలో ప్రభుత్వ సం స్థల ద్వారా కొనుగోళ్లు చేయిస్తే కనీస మద్దతు ధర లభించే అవకాశాలున్నాయని రైతులు ఆకాంక్షిస్తుంటే, కమిటీ మాత్రం కొనుగోళ్ల ఆచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని, ప్రభుత్వ సివిల్ సప్లైస్, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌ల మధ్య కొనుగోళ్లు జరిగే సమయంలో సహకార లోపం లేకుండా చూసుకోవాలని ప్రభు త్వానికి సలహాలిచ్చినట్లు తెలిసింది. దీంతో దళారులు రైతులను దోచుకునే పరిస్థితులుండవని కమిటీ చెప్పుకొచ్చింది కానీ, దోచుకునే దళారులపై ప్రభు త్వం కన్నెర్ర చేయాలని, మద్దతు ధరకన్నా రైతులకు తక్కువ వెల చెల్లించే వారిపై కఠిన చర్యలుండాలని కమిటీ చెప్పలేకపోవటం శోచనీయం.

పంట రుణాలు, గ్రామీణ ఉపాధి పథకాల అమలు తీరులో మార్పుపై రైతులు కోరిన మరొక రెండు న్యాయమైన కోరికలకు కందా కమిటీ కాని ప్రభు త్వం కాని స్పందించిన తీరు అనుచితంగా ఉంది. వరి సాగు కోసం అందించే రుణ మొత్తాన్ని ఎకరాకు రూ.17,500 నుంచి రూ.25,000 రూపాయలకు పెంచాలనే సిఫార్సుకు… ఇది తమ పరిధికి చెందిన అంశాలలోకి రానందున నాబార్డ్‌తో సంప్ర దింపులు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. గ్రామీణ ఉపాధి పథకాన్ని కూలి ఖర్చులు భరించలేక నష్టాల్లో కూరుకుపోయిన చిన్న, సన్నకారు రైతులు… వ్యవసాయ పనులతో దాని అనుసంధానం కోసం కోరితే ప్రతిస్పందన శూన్యం.

ఈ పథకం కింద గ్రామీణ ఫ్రాంతాల్లో మాత్రమే పనులు చేయించకుండా దుర్వినియోగం చేస్తున్నారని విరివిగా ఆరోపణలు విని పిస్తున్నా, పట్టించుకోని ప్రభుత్వ వైఖరిని కందా కమిటీ పెడచెవిన పెట్టడం దారుణం. ఈ పథకాన్ని కొన్ని ముఖ్యమైన గ్రామీణ కమ్యూనిటీ పనులతో పాటు రైతుల వ్యవసాయ పనులకు అనుసంధాన పరచగలిగితే పథకంలోని అవినీతి పూర్తిగా దూరమవటమేకాక రైతుకు నిజమైన ఊరట కలుగుతుంది. వ్యవసాయ వ్యయభారం తగ్గుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది. రైతుకు తద్వారా తన మీద తనకు నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా పంట సెలవు ప్రకటించే దుస్థితి నుంచి దూరమయ్యే అవకాశం ఏర్పడుతుంది.

సాగునీటి, మురుగునీటి కాల్వల మరమ్మతులు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని, వాటి ఆధునీకరణ కూడా అంచెలంచెలుగా చేపట్టాలని కమిటీ అభి ప్రాయపడింది. గోదావరి డెల్టా ప్రాంతంలో ఈ మరమ్మతులకు వందల కోట్ల నిధులు అవసరం కాగా, కేవలం 20 కోట్ల రూపాయల నిధులు మాత్రమే ప్రభుత్వం నిర్దేశించటం నిజమైతే అంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. కందా కమిటీ ప్రభుత్వానికి పైసా ఖర్చు కూడా లేకుండా ఉండే అనేక సిఫార్సు లను తన నివేదికలో పొందుపరచింది. భారత ప్రభుత్వం కనీస మద్దతు ధర, ఎగుమతి విధానాలను ముందుగానే వెలువరించాలని కమిటీ సిఫార్సు చేసింది.

రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచాలన్న కమిటీ సూచనకు, 25 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గిడ్డంగులు, లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల కవర్ అండ్ ప్లింత్ నిర్మాణాలను చేపట్టే విధంగా రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ప్రకటించారు. ఈ నిర్మాణాలు సత్వరమే చేపట్టినా కనీసం రూ.150-200 కోట్లు. అయితే ఒక్క పైసా ఊసు కూడా లేకుండా ఈ నిర్మాణాలను చేపడతామని చెప్పడం ఒకింత అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.
ఇంకొక ముఖ్యమైన సిఫార్సు… 70 శాతం సబ్సిడీతో రైతులకు వ్యవ సాయానికి తోడ్పడే యంత్రాలను అందుబాటులోకి తేవాలనే అంశం. ప్రభుత్వం దళిత, గిరిజన రైతులకు ఈ పథకం అమలుచేయడానికి కావలసిన నిధుల గురించి మాట మాత్రమైనా చెప్పకపోవడం గమనార్హం.

పంట బీమా సొమ్ము, ఇన్‌పుట్ సబ్సిడీల ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా, గత అనుభవాల దృష్ట్యా దీనిపై రైతుల్లో నమ్మకం కన్నా అనుమానాలే ఎక్కువ. కొబ్బరి, ఆయిల్‌పామ్ పరిరక్షణ, బీమా అమలుకు అధికారులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్న సిఫార్సుకు, ఇవి తమ పరిధిలోనివి కావని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాంతీయ బోర్డుల ఏర్పాటుకు విజ్ఞప్తి చేయమని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కోనసీమ రైతు పరిరక్షణ సమితి వంటి అనేక సంస్థలు నివేదికలోని అంశాల పట్ల తమ నిరాసక్తతను, తీవ్రవ్యతిరేకతను వ్యక్తపరచాయి. ఇతర రాష్ట్రాలు ఇస్తున్న రూ.200 బోనస్ కూడా రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించకపోవడాన్ని రైతు సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. చిన్న, సన్నకారు, కౌలు రైతులకు నిజమైన లాభం చేకూరాలంటే, వారి శ్రేయస్సు ప్రభుత్వాల లక్ష్యమైతే వెంటనే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాగుబడి ఖర్చులు ఆకాశాన్నంటిన ప్రస్తుత పరిస్థితిలో మద్దతు ధరను పక్కకు నెట్టి రైతుకు లాభదాయకమైన ధరను నిర్ణయించాలని నిలదీస్తున్నారు.

రబీలో పండించిన ధాన్యానికి సముచిత ధర చెల్లించి వెనువెంటనే సేకరించాలని కోరుతున్నారు. పంట సెలవు ప్రకటించిన రైతుల శ్రేయస్సుపై ప్రభుత్వానికి నిజంగానే శ్రద్ధ ఉంటే, మళ్లీ వారు రబీ సేద్యం చేపట్టడానికి వీలుగా వెంటనే ఎకరాకు రూ.10,000 చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విన్నవిం చుకుంటున్నారు. మద్దతు ధర రెండు వందలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వాన్ని సకల మార్గాల ద్వారా ఒప్పించాలని వేడుకుంటున్నారు. ఈ న్యాయమైన కోరికలు సాధించుకునే దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామంటున్నారు. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఆయా అంశాలకు ప్రభుత్వం నుంచి లభించిన ఆమోదం నామమాత్రమే నని ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ప్రణాళికేతర ఖర్చు అంచనాలను అధికారులు చేపట్టిన సూచనలు ఎంతమాత్రం లేవు. ఒకవేళ నిజంగానే అంచనాలు వేసి ఉన్నట్లయితే ప్రభుత్వం తప్పనిసరిగా ఆ వివరాలను ప్రజల, రైతు సంఘాల దృష్టికి తీసుకొనివచ్చి ఉండేది. పంట విరామాన్ని ప్రకటించిన రైతుల ముఖ్య మైన కోరిక ఒక్కటే. అది తాము పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర. ఈ విషయంలో రైతులు అడిగిన బోనస్ ప్రకటించడం పట్ల ప్రభుత్వం ఉదాసీ నంగా వ్యవహరించింది.

రాబోయే రోజుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న పంట సెలవు ప్రభావం ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వ్యాపించి, ఆహార ధాన్యాల కొరత దిశగా పయనించే పరిస్థితులు మెండుగా ఉన్నాయి. భారత ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటున్న ‘ఆహార భద్రతా చట్టం’, అమలు, ఆహార ధాన్యాల కొరతతో ప్రభుత్వానికి ఒక పెను సవాలుగా మారొచ్చు. అందుచేత రాష్ర్ట ప్రభుత్వమే ఒక అడుగు ముందుకు వేసి కుదేలైన రైతులను వెంటనే ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మద్దతు ధర నిర్ధారించే యంత్రాంగాన్ని మేలుకొల్పాలి. లాభసాటి ధర లభించేలా రైతులకు తోడ్పడాలి. దళారుల ప్రభావాన్ని అరికట్టేలా వారికి భరోసా ఇవ్వాలి. ముఖ్యంగా రైతులకు ధైర్యాన్నిచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి.

Comments

Posted in Articles and tagged .

Leave a Reply