ఈ నిర్లక్ష్యానికి ‘విరామ’మివ్వండి -రామాంజనేయులు

వ్యవసాయాన్నే నమ్ముకున్న కోనసీమ రైతులు సాగుపైనే అలుగుతారని, సేద్యానికే సెలవు ప్రకటించేస్తారని కలలోనైనా ఊహించామా? పచ్చటి పంటలతో కళకళలాడాల్సిన ఖరీఫ్‌కు విరామం ప్రకటించేసి రాష్ట్రం ఉలిక్కిపడేలా చేశారు. ఇదేదో రాత్రికి రాత్రే పుట్టిన ఉద్యమం కాదు. ఈ నిరసన వెనుక అమ్ముడుపోక మగ్గిపోతున్న ధాన్యం నిల్వల్లా.. ప్రభుత్వ నిర్లక్ష్యం పేరుకుపోయి ఉంది. కష్టానికి ‘మద్దతు’ ఇవ్వని బూజుపట్టిన పాలకుల విధానాలున్నాయి. అందుకే, తాత్కాలికంగానైనా పంటకు సెలవు పెట్టి ప్రభుత్వాన్ని కదిలించాలనుకున్నారు రైతులు.

తూర్పుగోదావరి జిల్లాలోని అల్లవరం, ఉప్పలగుప్తం, పోలవరం, కాట్రేనికోనల్లో.. మొదలైన ఈ ఉద్యమం కొద్ది కొద్దిగానే అయినా పశ్చిమ గోదావరి, కృష్ణా, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు విస్తరించింది. వ్యవసాయ సంక్షోభం మళ్లీ చర్చనీయాంశం అయ్యింది. రైతుల నిరసనకు కనీస మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడమే కారణమా..? ఉపాధి హామీ పథకంతో కూలీల కొరత తలెత్తడమా..? ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడమా..? మార్కెట్‌లో పలికే ధరకంటే పెట్టుబడులు భారీగా పెరిగిపోవడమా..? ఏమిటి కారణం..? ఈ సమస్యకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారాలు వెతకాలి..? రైతుల ఆగ్రహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? ప్రముఖ వ్యవసాయరంగ నిపుణులు జి.వి. రామాంజనేయులు పంట విరామంపై చేసిన విశ్లేషణే ఈ వారం కవర్‌స్టోరీ.

ముదురుతున్న వ్యవసాయ సంక్షోభం మళ్లీ ‘పంట విరామం’ (క్రాప్ హాలిడే) రూపంలో బయటపడింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 90 వేల ఎకరాలలో వరి పంటకు సెలవు ప్రకటించడంతో అందరి దృష్టీ రైతు వైపు మళ్లింది.అల్లవరం, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల్లో మొదలైన ‘ఉద్యమ’ ప్రభావం మరికొన్ని మండలాలకు, జిల్లాలకు కూడా విస్తరించింది.

ఈ విషయాన్ని మనం ఒక ప్రాంతానికి చెందిన తాత్కాలిక సమస్యగా చూడడం తప్పు. వ్యవసాయ సంక్షోభంలో భాగంగా దాన్ని చూడాలి మనం. అలా చూసి ఆ సంక్షోభానికి మూల కారణాలను అన్వేషిస్తేనే.. శాశ్వత పరిష్కారాన్ని కనుగొనగలం. ప్రభుత్వాలు అలా చేయకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు మళ్లీ మళ్లీ ఉత్పన్నం అవుతున్నాయి. దీనికితోడు ప్రతి సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం వల్ల.. సమస్య మరింత జటిలమవుతోంది. అందుకే పంట విరామం తలెత్త్తడానికి అసలు కారణాలను లోతుగా పరిశీలిద్దాం.

ఐదేళ్లలో ఐదురెట్లు
విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు గడిచిన అయిదేళ్లలో దాదాపు 500 శాతం పెరిగాయి. ఇంతకు ముందు రైతులు తమ సొంత వనరుల మీద ఆధారపడితే ఇప్పుడు బయట వనరుల మీద ఆధారపడాల్సి వస్తోంది. దాంతో సేద్యం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. కాని పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా ధరలు పెరగకపోవడంతో రైతులకు వచ్చే నికర ఆదాయం తగ్గిపోయింది. వ్యవసాయ సాగు కోసం దేశంలోనే అత్యధిక పెట్టుబడులను పెడుతున్నది గోదావరి జిల్లాల రైతులే.

ఉపాధి హామీపై అపనిందలు
జీవన వ్యయం పెరగడం, ఇతర ఉపాధి అవకాశాలు లభించడం, ఉపాధి హామీ పథకం రావడంతో కూలీ రేట్లు బాగా పెరిగాయి. నాట్లు, కలుపుతీత, కోత సమయాల్లో రోజుకి మూడు వందల రూపాయల కూలీ ఇస్తున్నారు. కూలీల కొరత వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా..? ఉపాధి హామీ పథకం రావడం వల్ల సమస్య ఉత్పన్నమవుతున్నదా..? అన్నది విశ్లేషించుకోవాలి. కూలీల సంఖ్యాపరంగా చూస్తే ఉపాధి హామీ ప్రభావం తక్కువేనని చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం కూలీల సంఖ్య 7.5 లక్షలు. అందులో ఉపాధి హామీ పథకం కింద పని దొరికిన వారు కేవలం 5.25 లక్షలు (3.28 లక్షల కుటుంబాలు). అంటే సగటున సంవత్సరంలో 37 రోజులు మాత్రమే ఉపాధి లభిస్తోంది ఏ కూలీకైనా.

ఈ పథకం కింద వాళ్లకు మరో 63 రోజులు లభించే అవకాశం ఉంది కాని అది జరగడం లేదు. ఏడాది మొత్తంలో ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకే వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉంటాయి. ఆ సమయంలో కూలీలకు దొరికే పని దినాలు 12 లక్షలు మాత్రమే. అంటే సగటున ప్రతి కూలీకి లభిస్తున్నది ‘ఒకటి లేదా రెండు పని దినాలు’ మాత్రమే. ఇది పెద్దగా ప్రభావితం చేసేది కాదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.. ఉపాధి హామీతో కూలీలకు బేరమాడే శక్తి మాత్రం పెరిగింది. రైతుకు కూలీల మీద కోపం తెప్పిస్తున్నది కూడా ఇదే. విత్తనాలు, ఎరువులు, ప్రకృతి, రుణాలు, గిట్టుబాటు ధరలు ఇవేవీ రైతు చేతిలో లేవు. వాటి విషయంలో బాహ్యశక్తుల నిర్ణయం ప్రకారం నడుచుకోక తప్పదు. కూలీ ఒక్కడే అతనికి కనిపించే ప్రత్యక్ష శత్రువు. అందువల్లే కూలీల మీద, ఉపాధి హామీ పథకం మీద అంత అక్కసు వెళ్లగక్కుతున్నాడు.
ఈ ఏడాది ఖరీఫ్‌లో కోనసీమలో వరి నాటక పోవడం వలన కూలీలకు వచ్చిన నష్టమెంతో తెలుసా. ఎకరానికి 8 మంది కూలీలకు ఉపాధి కల్పించే చోట 90 వేల ఎకరాలలో నాట్లు పడకపోతే ఎన్ని కోట్ల పని దినాలు వాళ్లు నష్టపోయినట్టు?

78 శాతం కౌలు రైతులే
ఈ ప్రాంతంలో కౌలు రైతుల సంఖ్య ఎక్కువ. దాదాపు 78 శాతం మంది రైతులు వాళ్లే. అయినా కౌలు వ్యవహారమంతా మౌఖికమైనదే కాబట్టి.. కౌలు రైతులకు గుర్తింపు ఉండదు. భూమి మీద రుణాలన్నీ యజమానులే తీసుకుంటారు. దాంతో సాగు కోసం పెట్టుబడి పెట్టేందుకు కౌలు రైతులు అధిక వడ్డీకి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యకు తోడు కౌలు రేట్లు కూడా భారీగా పెరిగాయి.

గత సంవత్సరం ఎకరానికి 25 వేల రూపాయల నుంచి 30 వేల వరకూ కౌలు ధర పలికింది. దీనివల్ల కౌలు రైతులకి ఎక్కువ గిట్టుబాటు కావడం లేదు. ఈ ప్రాంతంలో రెండు మూడు తరాల నుండి వలసలు కూడా అందుకే పెరుగుతున్నాయి. భూముల యజమానులు ఇక్కడ ఉండి వ్యవసాయం చేయకపోయినా.. భూములపై వారి హక్కులు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రభుత్వ రాయితీలు, సదుపాయాలు సైతం సాగు చేసే కౌలుదారులకు కాకుండా.. భూముల యజమానులకే దక్కుతున్నాయి. దీంతో అన్ని రకాల దెబ్బలు తగిలి కౌలు రైతులు విపరీతంగా నష్టపోతున్నారు.

పెరిగిన ఖర్చును పట్టించుకోకపోతే ఎలా?
«ధాన్యం ధరల విషయంలో రైతులను ఎక్కువగా మోసం చేస్తున్నది ప్రభుత్వమే. దేశంలో పండిన ధాన్యంలో దాదాపు మూడొంతుల ధాన్యాన్ని ప్రభుత్వమే కొని ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం, ఇతర ప్రభుత్వ సంస్థల కోసం వినియోగిస్తోంది. ప్రభుత్వం ధరలు పెంచితేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ధరలు పెంచడం వల్ల వినియోగదారులపై భారం పెరుగుతుందని వాదించడం పొరపాటు. ఉన్న వినియోగదారులలో మూడొంతులు గ్రామీణ ప్రాంతాల వారేనని గమనించాలి.

వారి ఆదాయం అంతా వ్యవసాయం మీద నేరుగానో, పరోక్షంగానో ఆధారపడింది. ఆదాయాలు పెరగకుండా గ్రామీణ వ్యవస్థ బాగుపడే అవకాశం లేదు. సరైన ప్రాతిపదికన ధరలను నిర్ణయించకపోవడం వల్లే గిట్టుబాటు కాక రైతులు దెబ్బతింటున్నారు. సాగు కోసం పెట్టే పూర్తి ఖర్చులను, రైతుల జీవన వ్యయాన్ని లెక్కలోకి తీసుకోకపోవడం వల్లనే గిట్టుబాటు ధరలను తక్కువగా నిర్ణయిస్తున్నారు. దీంతో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా రైతుల మీద రెండింతల భారం పడుతోంది.

2004-05 సంవత్సరంలో క్వింటాలు ధాన్యం ఉత్పత్తికి 578 రూపాయల వ్యయం అయ్యేది. ఆ సమయంలో కేవలం మద్దతు ధర 560 రూపాయల ఉంది. అంటే ప్రతి క్వింటాలు ధాన్యం పండించడానికి 18 రూపాయలు నష్టం రైతే పెట్టుకోవాలి. 2011లో సాగు వ్యయం క్వింటాలుకు 1800 రూపాయలు అయింది. మద్దతు ధర 1080 రూపాయలకే పరిమితమైంది. అంటే 720 రూపాయలు నష్టం. మార్కెట్‌లో పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకోకుండా మద్దతు ధరను నిర్ణయించడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం మద్దతు ధరలు నిర్ణయించే విధానమే లోపభూయిష్టంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మద్దతు ధరను 1400 రూపాయలుగా ప్రతిపాదిస్తే, కేంద్ర ప్రభుత్వం రూ.1030 మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది. ఈ సంవత్సరం మన రాష్ట్రం రూ.2070 ప్రతిపాదిస్తే, కేంద్రం ఇచ్చింది రూ.1080. ప్రతిపాదించినదానికీ, ప్రకటించినదానికీ పొంతనే లేదు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి..? పక్క రాష్ట్రాలలో రెండు వందల రూపాయల వరకు బోనస్ ప్రకటించారు. మన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. అందుకే, ఈ రోజు పంట విరామం ఉద్యమస్థాయికి చేరుకుంది.

ధాన్యాన్ని నేరుగా ఎందుకు కొనదు?
దేశ వ్యాప్తంగా ధాన్యాన్ని మార్కెట్ యార్డుల ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సేకరిస్తే మన రాష్ట్రంలో మాత్రం ధాన్యం సేకరణ పూర్తిగా మిల్లర్ల అధీనంలోనే జరుగుతోంది. ధాన్యం సేకరించేటప్పుడు నాణ్యత లేదంటూ ధరలు తగ్గిస్తున్నారు మిల్లర్ల యజమానులు. 25 పంటలకు మద్దతు ధరలు ప్రకటించినా, సేకరిస్తున్నది మాత్రం రెండు పంటలకే కావడం విడ్డూరం. ధాన్యం సేకరణ లెక్కల్ని చూస్తే మరిన్ని చీకటి కోణాలు ఆవిష్కృతమవుతాయి. 2009-10లో మిల్లర్ల ద్వారా 62.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ప్రభుత్వ సంస్థల ద్వారా కేవలం రెండంటే రెండు లక్షల టన్నులను సేకరించడం ఎంత బాధాకరమైన విషయం.

అదే పంజాబ్‌లో అయితే.. మిల్లులు 4.74 లక్షలు టన్నులు సేకరిస్తే, ప్రభుత్వ సంస్థలు 88.01 లక్షల టన్నులు సేకరించాయి.

సేకరించిన ధాన్యాన్ని మర పట్టిన తర్వాత- ప్రతి క్వింటాలుకి 670 కిలోల బియ్యం, 607 కిలోల తవుడు, 6 కిలోల నూక, 25 కిలోల ఊక వస్తుంది. ఇవి మొత్తం అమ్మితే మిల్లర్లకు రూ.1371 చేతికొస్తుంది. మద్దతు ధర రూ.1030తోపాటు, రవాణా ఖర్చు రూ.60, మిల్లింగ్ ఖర్చు రూ.30, పన్నులు రూ.15 మొత్తం కలిపితే- 1235 రూపాయలు అవుతుంది. ఈ లెక్కన ప్రతి క్వింటాలుకి 136 రూపాయలు చొప్పున మిల్లర్లకు మిగులుతుంది. అయినా సరే మిల్లర్లు చాలాసార్లు రైతులకు కనీస మద్దతు ధరను కూడా చెల్లించడం లేదు. ఆఖరికి కష్టపడి పంట పండించిన రైతుల కంటే.. మిల్లర్లే లాభపడుతున్నారు. మిల్లర్లు సేకరించిన ధాన్యంలో 75 శాతం లెవీకి ఇవ్వాలి. మిగిలిన ధాన్యాన్ని ఎక్కడైనా, ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు.

***

ఈ సమస్య కేవలం వారిది మాత్రమే కాదు. గోదావరి జిల్లాలకూ పరిమితం కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక రూపంలో వ్యవసాయ సంక్షోభ రూపంలో తలెత్తుతూనే ఉంది. ప్రకటించిన ‘పంట విరామం’ వేల ఎకరాల్లో ఉంటే, అప్రకటిత పంట విరామం మొత్తం సాగు విస్తీర్ణంలో ఏటా 12 శాతం వరకు ఉంటోంది. అంటే 24 లక్షల ఎకరాలు. ఇది అక్కడక్కడా ఎవరికి వారు చేయడం వల్ల మనకు ‘ఘనంగా’ తోచదు. కోనసీమలో రైతులు సంఘటితంగా చేయడం వల్లనే ఈ మాత్రం చర్చనీయాంశం అయింది.

ప్రభుత్వం ఏం చేయాలి..?
* వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకునే పద్ధతులను ప్రోత్సహించాలి. పురుగుమందులు, ఎరువుల వాడకం తగ్గించుకుంటే, ఎకరానికి సుమారు అయిదు వేల రూపాయల వరకు మిగులుతుంది.
* కూలీల ఖర్చు పెరుగుతున్న మాట వాస్తవమే కాబట్టి ఎకరానికి కనీసం నలభై పనిదినాలు ఉపాధి హామీ పథకంతో సమానంగా సబ్సిడీ ఇవ్వాలి. అంటే కూలీకి రైతు చెల్లించే రెండొందలో, మూడొందలో దినసరి కూలి నుంచి ప్రభుత్వం ఆ కూలీకి పని కల్పించేటపుడు ఇచ్చే రోజువారీ వేతనం రూ.125ను రైతుకు సబ్సిడీగా ఇవ్వాలి.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయటం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అందులో ఒకటి.. ఉపాధి హామీ పథకం కూలీలకు హక్కు రూపంలో లభించినది. వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల అది రైతుల హక్కుగా మారుతుంది. రైతులకు కావాల్సినపుడు పనులు ఇస్తారు. లేదంటే పనులు దొరకవు. ఇది ఉపాధి హామీ పథకం స్ఫూర్తిని దెబ్బ తీస్తుంది. అయితే, రైతులకు అందించే కూలీల సబ్సిడీ ఉపాధి హామీ పని దినాలకు అదనంగా ఇవ్వటం వల్ల.. అటు రైతులకు, ఇటు కూలీలకు కూడా మేలు జరుగుతుంది.

* వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదని పెద్ద పెద్ద యంత్రాలు ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ఒక కేంద్రానికి 75 లక్షల రూపాయలు ఖర్చు అయితే, 30 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో సమస్య తీరకపోగా ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించాలి.
* యంత్రాలను విరివిగా ఉపయోగించడం వల్ల పంజాబ్‌లాంటి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను తెలుసుకోవడం మంచిది. అయితే, యంత్ర ఉపయోగం పెరగడం కూడా అవసరమే. గ్రామస్థాయిలో ఉపయోగించుకోగల యంత్రాలను కూలీల సంఘాలకు, రైతు సంఘాలకు ఇస్తే సమస్య కొంతవరకు తీరుతుంది.
* కౌలు రైతులకు రుణాలు హామీగానే మిగిలిపోయాయి. గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. కాని ఇంతవరకు ఎన్ని ఇచ్చారో తెలియదు. రుణాలు కూడా కొందరికే అందాయి. కౌలు మీద పరిమితి విధించకుండా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు.
* ధరలను నిర్ణయించే విధానంలో సమూలంగా మార్పులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రతిపాదించినప్పుడు పూర్తి పెట్టుబడులను లెక్కలోకి తీసుకోవాలి. దాని ఆధారంగా రైతుకు దక్కాల్సిన లాభాన్ని కూడా పరిగణనలోకి (స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు పెట్టుబడి ఖర్చు + యాభై శాతం) తీసుకోవాలి. అయితే, పెట్టుబడి తక్కువ ఉండే పంటల రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చి ఎక్కువ పెట్టుబడులు పెట్టే పరిస్థితికి రావచ్చు. అందువల్ల పెట్టుబడి ఖర్చులతోపాటు, జీవన వ్యయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ధరలు నిర్ణయించాలి. ఒకవేళ కేంద్రం ప్రకటించిన ధర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ వ్యత్యాసాన్ని రైతులకి నేరుగా అందించాలి.

* ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కొన్నిసార్లు మహిళా సంఘాల ద్వారా ధాన్యాన్ని సేకరించింది. అయితే సేకరించిన ధాన్యం నిల్వ చేసేందుకు వారికి కనీస వసతులు కల్పించలేక పోయింది ప్రభుత్వం. చెల్లింపులలో కూడా జాప్యం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం లోపాలను సవరించుకుని మళ్లీ ఈ కార్యక్రమం ప్రారంభిస్తే ప్రయోజనం ఉంటుంది.

* చివరగా.. వ్యవసాయాభివృద్ధిని రైతుల ఆదాయంలో వచ్చే అభివృద్ధిగా ప్రభుత్వం చూడకుండా, ప్రభుత్వం దానికి బాధ్యత వహించకుండా ఉన్నంత కాలం ఈ సమస్యకు పరిష్కారం లేదు. ఏదో ఒక రూపంలో ఇది మళ్లీ మళ్లీ బయటపడుతూనే ఉంటుంది. రైతులకు ఆదాయ భద్రత కల్పించే దిశలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రాష్ట్రస్థాయిలో, కేంద్ర స్థాయిలో కూడా రైతుల సంక్షేమం కోసం ‘ఆదాయ కమిషన్’ను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ సాగు కోసం పెట్టే పెట్టుబడి, ప్రభుత్వ సబ్సిడీలు, పంటల ఉత్పత్తికి దక్కే ధరలు, పెరుగుతున్న జీవన వ్యయం – ఈ నాలుగింటి ఆధారంగా కమిషన్ ప్రతి అయిదేళ్లకు ఒకసారి లెక్కలు తీయాలి. దేని ధర ఎంత ఉండాలో నిర్ణయించాలి.

* ఆదాయ భద్రతను చట్టపరమైన హక్కుగా రైతులకు ఇవ్వనంత కాలం..ధాన్యానికి మద్దతు ధర పెంచినా లాభం లేదు. ఇక్కడో రెండు మూడు వందలు పెంచినా రైతుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల వంటి వాటి ధరలు కూడా అదే సమయంలో పెంచుకుంటూ పోతే రైతుకు వచ్చే లాభం ఏముంటుంది..? వీటన్నిటితో పాటు గత అయిదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ‘సామాజిక భద్రత బిల్లు’ను కూడా వెంటనే ఆమోదించాలి. ఈ పనులన్నీ చేస్తేనే వ్యవసాయ సంక్షోభం తగ్గుముఖం పడుతుంది. పంట విరామం లాంటి నిస్పృహ చర్యలకు రైతులు పాల్పడాల్సిన అవసరం రాకుండా ఉంటుంది.

మేమూ ఊహించలేదు
పంట విరామ ఉద్యమం ఈ స్థాయికి చేరుతుందని మేము మొదట ఊహించలేదు. నాలుగైదు గ్రామాల్లో పెద్ద రైతులు మాత్రమే సాగు నిలిపేస్తారనుకున్నాం. వ్యవసాయ నష్టాల గురించి రైతులంతా రెండు మూడేళ్ల నుంచి మధనపడుతున్నారు. పరిష్కారం కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. రెండు మూడేళ్లుగా వరదల వల్ల సార్వా (ఖరీఫ్) సీజన్‌లో తీవ్రమైన నష్టాలు వచ్చాయి. ధాన్యం తడిసిపోయి, అమ్ముడుపోక నష్టాలు మూటగట్టుకున్నారు రైతులు. గత రబీ సీజన్‌లో నాట్లు ఆలస్యమైనా దిగుబడి బాగానే వచ్చింది. అయినా ఏం లాభం? పండిన ధాన్యంఅమ్ముడుపోలేదు.

బాగున్న ధాన్యం బస్తా ధర కేవలం రూ.450-550 మధ్య పలికింది. ఇక, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కే లేదు. ఈ ప్రాంతంలో ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేసేది మిల్లర్లు, కమీషన్ వ్యాపారులే. ఈ మధ్య గోడౌన్లు ఖాళీ లేకపోవడంతో మిల్లర్లు కూడా ధాన్యం కొనుగోళ్లు ఆపేశారు. ప్రతి రైతు ఇంట్లో అమ్ముడుపోని ధాన్యం నిల్వలే కనిపిస్తున్నాయి. దాంతో ఉన్న ధాన్యాన్ని అమ్ముకుంటే చాలు.. మళ్లీ కొత్త పంట ఎందుకు వెయ్యాలి..? అన్నారంతా. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రైతు చైతన్య యాత్రల్లో కూడా ధాన్యం కొనుగోళ్లపై అధికారులను నిలదీశాం. కొన్నిచోట్ల నిర్బంధించాం. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి బోలెడు విన్నపాలు ఇచ్చాం.

హామీలతో అందరూ కాలక్షేపం చేశారు కానీ రైతుకు మాత్రం ఊరట చేకూర్చలేదు. చివరికి జూన్ మొదటి వారంలో మా చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల రైతులంతా కలిసి సమావేశమయ్యాం. సార్వా (ఖరీఫ్) సాగు చేయకూడదని గట్టిగా తీర్మానించుకున్నాం. రైతులంతా కలిసి రాకున్నా.. కనీసం పెద్ద రైతుల వరకైనా ముందుకొస్తారనుకున్నాం. ఇదే విషయాన్ని మిగతా మండలాల్లోనూ చెబితే.. అంతా సరేనన్నారు. మహా అయితే నాలుగైదు గ్రామాల్లో ఓ యాభై శాతం రైతులు పంటవిరామం ప్రకటిస్తారనుకున్నాం. కానీ, మా అంచనాలు తలకిందులయ్యాయి. పల్లెల్లో రైతులంతా నడుంబిగించారు. లక్ష ఎకరాల్లో నాట్లు నిలిచిపోయాయి. ఇప్పుడైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి.
– యాళ్ల బ్రహ్మానందం, రైతు ఉద్యమ నేత
http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2011/sep/18/coverstory&more=2011/sep/18/sundaymain
……………………………………………
జీ. వీ. రామాంజనేయులు
రచయిత సెల్ : 90006 99702
ramoo.csa@gmail.com
ఫోటోలు : విజయకుమార్

Comments

Posted in Articles, Ramoo blog and tagged .

Leave a Reply