రైతుకు కష్టం వస్తే ఆయన మరుక్షణం అక్కడ ప్రత్యక్షం అవుతారు. రైతు సంతోషంలోనే దేశ ప్రగతి ఉందని బలంగా నమ్ముతారాయన. అందుకోసం ఐ.ఆర్.ఎస్.సెలక్షన్‌ను వదులుకున్నారు. లక్ష జీతం వచ్చే సైంటిస్ట్ ఉద్యోగాన్ని గడ్డిపోచకింద తీసిపారేశారు. జన్యు మార్పిడి పంటలు, బిటి వంకాయలపై సాగిన పోరాటాన్ని ఆయన ముందుండి నడిపించారు.
ఎరువులు, క్రిమి సంహారకాలు లేకుండా, సేంద్రీయ పద్ధతుల్లో పంటలు పండించే ఉద్యమాన్ని చేపట్టి దేశంలోనే మన రాష్ట్రాన్ని అదర్శంగా నిలిపారు. దేశంలో అపారంగా ఉన్న వనరులను చేజేతులా దుర్వినియోగం చేసుకుంటున్నాం.. అంతకు మించిన దేశద్రోహం లేదంటారు డాక్టర్ జి.వి. రామాంజనేయులు. రైతులకు అండగా ఉంటూ, వాళ్లను పీడించే వర్గాలకు కంటిమీద కునుకులేకుండా చేసే ఆయన అంతరంగం ఇది.
ఢిల్లీోని వ్యవసాయ పరిశోధనా సంస్థలో డాక్టరేట్ చేస్తున్న రోజులవి. ఐ.ఏ.ఎస్. చదివి దేశానికి సేవ చేయాలనుకున్నాను. అందుకు ప్రిపేర్ అవుతూ భారత ఆర్థిక రంగాన్ని అధ్యయనం చేశాను. ప్రపంచంలో మరే దేశంలో లేని అపారమైన సహజ వనరులు, మానవ వనరులు మనకున్నాయి. అయినా మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? మనందరికీ అన్నం పెట్టే రైతు అడుగడుగునా మోసపోతున్నాడు.
ఆర్థిక వ్యవస్థ మొత్తం రైతు మీద ఆధారపడి ఉంది కానీ రైతు మాత్రం అనాథగా మిగిలిపోతున్నాడు. రేయింబవళ్లు కష్టపడి రైతు పంట పండిస్తాడు. దాన్ని దళారులు దోచుకుపోతుంటే రైతు నిస్సహాయంగా మిగిలిపోతున్నాడు. ఇదీ సమస్యకు మూలం అనిపించింది. రైతు ఆనందంగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుందనుకున్నాను. ఆ సమయంలో ఐ.ఆర్.ఎస్.కు ఎంపికయ్యాను.
ఓ అధికారిగా దేశానికి సేవచేసే బదులు వ్యవసాయాన్ని సుసంపన్నం చేసేందుకు శాస్త్రవేత్తగా కృషి చేద్దాం అనుకొని ఐ.ఆర్.ఎస్. వదులుకున్నాను. పిహెచ్.డి. పూర్తి చేసి హైదరాబాద్‌లోని నూనె గింజల పరిశోధనా సంస్థలో సైంటిస్ట్‌గా చేరాను. రైతులతో నిత్యం కలిసే వాడిని. వాళ్ల కష్టాలు… కన్నీళ్లు చూసే వాడిని. రైతులు, రైతు సంఘాల చుట్టూ తిరుగుతున్న నన్ను చూసి “శాస్త్రవేత్తగా ఎదిగి… బాగా సంపాదించక ఈ రైతుల జపం ఏంటని” మా బాస్‌లు, సహచరులు అవహేళన చేసేవాళ్లు. అయినా నా దారి నాదే. అక్కడ పనిచేసిన పదేళ్ల కాలంలో రైతులతో అనుబంధం బాగా పెరిగింది. మన దేశంలో రైతులకు ఉన్న పరిజ్ఞానం ముందు శాస్త్రవేత్తలు దిగదుడుపే అని అర్థం అయింది. నిజంగా రైతులకు సేవ చే సేందుకు నేనెంచుకున్న మార్గం సరైంది కాదనిపించింది.
కదిలించిన ఆత్మహత్యలు
మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరిగిన రైతుల ఆత్మహత్యలు నన్ను కదిలించి వేశాయి. మనకు అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? ఏదో ఒకటి చేయాలి… రైతును ఆదుకోవాలనుకున్నాను. నిజానికి నేనేమీ వ్యవసాయ కుటుంబం నుంచి రాలేదు. కర్నూలు జిల్లా డోన్‌లో పుట్టాను. నాన్నగారు రైల్వే ఉద్యోగి. బాపట్లలో అగ్రికల్చర్‌లో డిగ్రీ, పి.జీ చేశాను. అప్పటి నుంచే నాకు రైతులు, వాళ్ల సమస్యలతో సాన్నిహిత్యం ఏర్పడిందనుకుంటాను. ఉద్యోగం వదిలేసి పూర్తిగా రైతు సంక్షేమం కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాను.
శాస్త్రవేత్తలుగా అప్పటి నా కొలీగ్స్ ఈ రోజున లక్ష రూపాయల వరకు జీతం సంపాదిస్తున్నారు. నాకు జీతంతో సంతృప్తి రాదనిపించింది. చాలామంది రిటైరయ్యాక ఏదో ఒక ఎన్.జి.వో పెట్టి సేవచేద్దాం అనుకుంటారు. ఒంట్లో ఓపిక అయిపోయాక ఏంసేవ చేస్తాం? అని ప్రశ్నించుకున్నాను.
ఉద్యోగం వదిలేశాను. కార్యరంగంలోకి దిగాను. విత్తనాలు, సేంద్రీయ ఎరువులు, నీటివనరులు, మద్దతు ధర.. ఇలా రైతు ఎదుర్కొంటున్న ఏదో ఒక సమస్యను తీసుకొని చాలా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు కాకుండా ఆత్మసంతృప్తి కోసం పనిచేసే ఎన్.జి.ఓ.లు కూడా ఉన్నాయి. అలా కాకుండా రైతు సంక్షేమంపై సమగ్రంగా దృష్టి సారించే లక్ష్యంతో 2004లో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ)లో చేరాను.
టెక్నాలజీ భూతం
రైతుల ఆత్మహత్యలపై సంస్థ తరపున అధ్యయనం ప్రారంభించాం. వాళ్ల ఆత్మహత్యలకు కారణం వాళ్లు అప్పుల ఊబిలో కూరుకుపోవడం కాదు.. టెక్నాలజీ వైఫల్యం అని తేలింది. సైన్స్, టెక్నాలజీలు రెండువైపులా పదునున్న కత్తి వంటివి అంటారు. నిజానికి టెక్నాలజీ అనేదానికి ఒక నిర్ధిష్ట ప్రయోజనం ఉంటుంది. ఆ టెక్నాలజీని తయారు చేసే వారి ప్రయోజనాలు కూడా అందులో ఇమిడి ఉంటాయి. వ్యవసాయ యంత్రాల విషయంలో అదే జరిగింది. మన రైతులకు ఏమాత్రం తెలియని, మన పరిస్థితులకు ఏ మాత్రం సరిపడని యంత్రాలను బలవంతంగా వారి మీద రుద్దారు.
ఉన్న కష్టాలకు తోడుగా సాంకేతిక పరిజ్ఞానం భూతం వచ్చి మీదపడడంతో కలవర పడిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిర్థారించాం. ఆ వివరాలతో ‘పత్తి విషాద కథ’ పేరిట ఓ పుస్తకాన్ని కూడా ప్రచురించాం. చిన్నచిన్న కమతాలున్న మన పొలాలకు అంత పెద్ద పెద్ద యంత్రాలు ఎందుకని ప్రశ్నించాం. మేం చెప్పిన దాన్ని మొదట చాలామంది అంగీకరించలేదు.
మెల్లగా మా వాదనను సమర్థించే వారి సంఖ్య పెరిగింది. మన దేశ ఆర్థిక, సామాజిక, పర్యావరణ పరిస్థితులకు అనుగుణమైన పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తే ఖర్చు తక్కువ. ఫలితం ఎక్కువగా ఉంటుంది. వేల సంవత్సరాల వ్యవసాయ పరిజ్ఞానం, అద్భుత వనరులున్న మన దేశ రైతులకు మిడిమిడి జ్ఞానంతో తయారైన విదేశీ యంత్రాలు, వంగడాలు ఎందుకనే ఆలోచన మన నేతలు, అధికారులు, శాస్త్రవేత్తలు, అధికారులకు ఎవరికీ రాకపోవడం విచారకరం. మన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలం ఇదే.
తిండి.. గాలి అన్నీ కలుషితం
అసాధారణ రీతిలో ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడక తప్పని వంగడాలను రైతులకు అందిస్తున్నారు. ఎరువులు, క్రిమిసంహారకాల వల్ల దిగుబడి పెరగడం మాటేమో కానీ భూసారం నాశనం అవుతోంది. రైతులు, కూలీలు వ్యాధుల బారిన పడుతున్నారు. పండే పంట రసాయనాలమయం అవుతున్నది. ఫలితంగా ప్రజలు జబ్బుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలకు వాటిని ఉత్పత్తి చేసే కంపెనీల మీద ఉన్న అవ్యాజమైన ప్రేమే ఇంతటి అనర్థానికి కారణం.
వ్యవసాయ రంగానికి లక్షకోట్లకు పైగా సబ్సిడీలు ఇస్తున్నాం అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా అందులో అధిక శాతం ఎరువులు, విత్తనాల కంపెనీల పాలవుతోంది. అన్ని కోట్ల రూపాయలు పెట్టి వాళ్లను పోషించే బదులు, ఆ డబ్బునే నేరుగా రైతు సంక్షేమానికి ఉపయోగిస్తే మన రైతు మహరాజులా బతుకుతాడు.
మనం తినే తిండిని, పీల్చే గాలిని నాశనం చేసే ఎరువులు, క్రిమిసంహారకాలు లేని పంటలు పండిస్తేనే రైతుకు, జాతికి కూడా భద్రత అని స్పష్టమయింది. మెల్లిగా రైతులకు నచ్చచెప్పడం మొదలుపెట్టాం. 2004లో 220 ఎకరాల్లో పురుగుల మందులు వాడకుండా సేంద్రీయ ఎరువులు ఉపయోగించి వ్యవసాయం చేసే విధంగా రైతులను ప్రోత్సహించాం.
మంచి ఫలితాలు రావడంతో 2005లో 25వే ల ఎకరాల్లో సేంద్రీయ ఎరువులతో పంటలు పండించాం. ప్రస్తుతం 3 వేలకు పైగా గ్రామాల్లో లక్షలాది ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం జరుగుతున్నది. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న గ్రామాల్లో ఇప్పటి వరకు ఒక్కరైతు కూడా ఆత్మహత్య చేసుకోకపోవడం ఈ విధానం సాధించిన విజయానికి సంకేతం.
సేంద్రీయ అద్భుతం
ఖమ్మం జిల్లా పునుకుల గ్రామంలో వెయ్యి ఎకరాల్లో మేం చేపట్టిన సేంద్రీయ వ్యవసాయాన్ని మంత్రి రఘువీరారెడ్డి స్వయంగా పరిశీలించారు. నామమాత్రపు ఖర్చుతో అధికదిగుబడి సాధించ డంతో పాటు పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉన్న సేంద్రీయ వ్యవసాయం ఆయనకు బాగా నచ్చింది. సేంద్రీయ వ్యవసాయాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తాం అని హామీ ఇచ్చారు. కానీ షరామామూలే కొందరు అధికారులు, శాస్త్రవేత్తలు అడ్డుపుల్ల వేశారని వినికిడి. అయినా మా పోరాటం ఆపలేదు.
రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు మార్గాలు ఏమిటని ఓ సమీక్షలో ప్రధాని శాస్త్రవేత్తలను ప్రశ్నించినప్పుడు దశాబ్దాలుగా పాడిన పాటనే వాళ్లు పాడారు. అప్పుడు మా సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ఆయనకు వివరించాం. ” మీరు నిధులివ్వండి… దేశవ్యాప్తంగా చేసి చూపిస్తాం” అనేసరికి ఆయన 182 కోట్ల నిధులు మంజూరు చేశారు. 2014 నాటికి దేశవ్యాప్తంగా 25లక్షల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేయాలని మా అందరి లక్ష్యం.
అంతకు ముందుగానే ఆ లక్ష్యాన్ని చేరుకోగలమనే విశ్వాసంతో స్వచ్ఛంద కార్యకర్తలు, రైతులు కృషి చేస్తున్నారు. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పంటను ప్రత్యేక దుకాణాల ద్వారా లేదా విక్రయకేంద్రాల ద్వారా రైతులే దగ్గరలోని పట్టణాల్లో విక్రయిస్తున్నారు. ఎరువుల వాడని ఆహార ఉత్పత్తులను ప్రజలు చక్కగా ఆదరిస్తున్నారు.
జన్యుమార్పిడి శాపం
సహజసిద్ధమైన ఆహారం తింటే మనం, మనతో పాటు సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనకు తెలియకుండానే, చాపకింద నీరులా జన్యుమార్పిడి జరిగిన వంగడాలను మనపై రుద్దారు నేతలు, శాస్త్రవేత్తలు. ఏం వంగడాలు వేసుకోవాలో, ఏం ఎరువులు, పురుగుల మందులు వాడాలో, ఎవరికి, ఎంతకు ఆమ్మాలో అన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
అయినా ప్రభుత్వ నిర్వాకానికి రైతు బలైతే మాత్రం ఎవరూ బాధ్యత వహించరు. మన రాష్ట్రంలో ఎందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనే ఖచ్చితమైన సమాచారం ప్రభుత్వం దగ్గర లేనేలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేల సంవత్సరాలుగా సహజసిద్ధంగా మనం పంటలు పండించుకుంటుంటే ఈ జన్యు మార్పిడి చేసిన పత్తి, మిరప, టమాటో పంటలు ఎందుకంటూ రైతుల్లో అవగాహన కల్పించే పని మొదలుపెట్టాం.
జన్యు మార్పిడి పంటల వల్ల ఎన్నో అనర్ధాలు మొదలయ్యాయి. ఆ పంటలు మంచివా? కాదా? వాటి ఫలితాలను పరీక్షించకుండానే మనమీద రుద్దుతున్నారు. తాను ఏ గింజలు నాటుకోవాలో నిర్ణయించుకొనే అధికారం రైతుకు లేకపోవడం బాధాకరం. జి.ఎం. పంటలపై మెల్లిగా దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలైంది. దేశవ్యాప్తంగా 150 సంస్థలతో జన్యుమార్పిడి పంటలు లేని భారత దేశం కోసం ఒక సమాఖ్యగా ఏర్పడి పోరాటం ప్రారంభించాం. దాంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది.
ఒక పోరాటం..విజయం
తాజాగా బిటి వంకాయపై సాగించిన సమరం ఓ అద్భుతం. సమాజంలోని అన్ని వర్గాలు సర్కారు నిర్ణయంపై సమరశంఖం పూరించాయి. వంకాయకు పురుగు ఎక్కువ పడుతుంది కాబట్టి పురుగును చంపే పదార్థాన్ని జోడించిన వంగడం తయారు చేశాం.. మీరంతా నెత్తికెత్తుకోండనడం విడ్డూరం. వంగడంలోనే విషం ఉంటే మనల్ని నేరుగా విషం తినమనేగా అర్థం. దీనిపై శాస్త్రవేత్తలు, మేధావులు, అధికారులు చివరకు సామాన్య ప్రజలు కూడా యుద్ధం ప్రకటించారు.
వ్యవసాయ విధానాల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలనే వాదనతో మంత్రి జైరాంరమేష్ ఏకీభవించారు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతకు తలొగ్గి బిటి వంకాయతో పాటు, జన్యుమార్పిడి పంటల వాడకాన్ని ప్రభుత్వం ప్రస్తుతానికి నిషేధించింది. ఇది ప్రజలు సాధించిన గొప్ప విజయం.
ఆదాయ కమిషన్ అవశ్యం
ఒక ఉద్యోగి జీవితం పెద్దగా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకోసారి కమిటీలు వేసి జీతాలు పెంచుతారు కానీ దేశానికి పట్టెడన్నం పెట్టే రైతుకు మాత్రం ఎలాంటి భద్రత లేదు. శ్రమకు తగిన ఆదాయం వస్తుందన్న గ్యారెంటీ లేదు. అతని తిండికి కానీ, బతుకుకు కానీ భరోసా లేదు. పైగా ఎరువులు, విత్తనాల కోసం వీధి పోరాటాలు చేయాలి. దళారుల చేతిలో మోసపోవాలి. ఇలా ఎప్పుడూ ఏదో ఒక ఉపద్రవం రైతును వెంటాడుతూనే ఉంటుంది.
అందుకే గడిచిన పదేళ్లలో కోటి మందికి పైగా రైతులు వ్యవసాయానికి దూరమయ్యారు. వాళ్లకు ఏదైనా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం ఉందా అంటే అదీ లేదు. ఎరువులు, పురుగుమందుల పుణ్యమా అని వ్యవసాయ భూములు నిస్సారం అయిపోతున్నాయి. పంటచేలు ప్లాట్లుగా మారిపోతున్నాయి. వ్యవసాయం చేయలేక, భూమి లేక రైతులు వ్యవసాయానికి దూరం అయితే మన భవిష్యత్తు ఎలా ఉంటుందనే ఆలోచన ఎవరూ చేయరు. ఒక ఉద్యోగి జీతం పదేళ్లలో కనీసం రెట్టింపు అవుతుంది.
దేశంలోని ఏ రైతు ఆదాయం అయినా రెట్టింపు అయిందేమో చూడండి. ఎంపీలు, ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెరిగాయి. మరి మనకు ఓట్లు వేసి గెలిపించిన రైతుల జీవన ప్రమాణాలు ఎందుకు పెరగడం లేదని ఏ ఒక్క రాజకీయ నాయకుడూ ఆలోచించడెందుకని? అందుకే రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం అదాయ కమిషన్ వెయ్యాలి. వ్యవసాయ రంగ ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించాలి. అలా జరిగి రైతు ముఖంలో ఆనందం నిండే వరకు నా పోరాటం సాగుతూనే ఉంటుంది.
జూ ఇంటర్వ్యూ: టి. కుమార్
ఫోటోలు: ఎం.ఎస్. రాజు
-మనం తినే తిండిలో 51 శాతం రసాయనాల వల్ల కలుషితం అవుతోంది.
-తల్లి పాలలో కూడా క్రిమిసంహారకాల ఆనవాళ్లు కనిపించాయి.
- క్రిమిసంహారకాలు వాడడం వల్ల ఏటా 2లక్షల మంది కూలీలు, రైతులు చనిపోతున్నారు. 2 కోట్ల మంది జబ్బుల పాలవుతున్నారు.
- క్రిమిసంహారకాలు వాడిన తిండి తినడం వల్ల క్యాన్సర్, చర్మవ్యాధులు, కిడ్నీ, లివర్ సమస్యలు, హృద్రోగ సమస్యలు వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
-సహజమైన ఆహారం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం, తద్వారా సమాజం బావుంటుంది.
అమ్మకానికో గ్రామం!
2005లో మహారాష్ట్రలోని డోర్లి గ్రామాన్ని అమ్మకానికి పెట్టారు. వ్యవసాయం చేయలేక ఆ గ్రామంలోని రైతులందరూ ఎరువుల వాడకం వల్ల నిస్సారంగా మారిన భూములను వదిలేసి వలస వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. మన వ్యవసాయ రంగం దుస్థితికి ఇది నిలువుటద్దం. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మేం అక్కడకు వెళ్లి అతి తక్కువ ఖర్చుతో సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ఎలాగో చెప్పాం.
రైతులు కొత్త పరిజ్ఞానాన్ని మరచిపోయి… సేంద్రీయ పద్ధతిలో సాగుచేసేందుకు ముందుకు రావడానికి రెండేళ్లు పట్టింది. ఆ గ్రామం మళ్లీ ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంతో కళకళలాడుతున్నది. మన రైతు మనసు స్ఫటికలా స్వచ్ఛమైనది. ప్రతిఒక్కరినీ నమ్ముతాడు. నమ్మకం ఆధారంగా పెనవేసుకున్న సంబంధాలే మన దేశానికి, రైతుకీ శ్రీరామరక్ష.